YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తూర్పుగోదావరికి మరో రికార్డ్

తూర్పుగోదావరికి మరో రికార్డ్

విజయవాడ,

దేశంలోనే ఇంధన పొదుపులో ముందంజలో ఉన్న రాష్ట్రం త్వరలో మరో స‌రికొత్త ఘ‌న‌త‌ను సాధించనుంది. తూర్పుగోదావరి జిల్లాను దేశంలోనే తొలి పూర్తి స్థాయి ఎల్‌ఈడీ వీధి దీపాలు కలిగిన జిల్లాగా ప్రకటించనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అంశాన్ని ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించనున్నారు. జిల్లాలో 3.1 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చనున్నారు. దీంతో 34 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవనుంది. ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు, అధికారులతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈఈఎస్‌ఎల్ సంస్థ సాయంతో కేవలం 5 నెలల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చి దేశంలోనే ఏపీని నెంబర్-1గా నిలిపారని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఇంధన శాఖ అధికారులను అభినందించారు. ఇతర జిల్లాలు కూడా ఇలా లక్ష్యం నిర్దేశించుకుని మిగిలిన 30 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలను అమర్చాలని ఆదేశించారు. తద్వారా 333 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు తనకు రెండు కళ్లు వంటివని, నీరు, రోడ్లు, ఇళ్లు, ఇతర వౌలిక సదుపాయాల్లో సమాన ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే తనకూ సంతోషమన్నారు. ఎల్‌ఈడీ వీధిదీపాలను అన్ని జిల్లాల్లో విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలపై అధ్యయం చేయాలన్నారు. తద్వారా మరింత మెరుగైన సేవలు అందించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశం మొత్తం మీద 50 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేయగా, మన రాష్ట్రంలో 11.61 లక్షల దీపాలు అమర్చారని ముఖ్యమంత్రికి లోకేష్ వివరించారు. వీధిదీపాల అమరికకు పంచాయతీరాజ్ శాఖ అమలు చేస్తున్న రన్‌రేట్ పద్ధతి సత్ఫలితాలు ఇస్తోందన్నారు. రోజువారీ వీధిదీపాల పర్యవేక్షణ, రిమోట్ ఆపరేషన్‌కు వీలుగా కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థను తన డ్యాష్‌బోర్డుకు అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎల్‌ఈడీ వీధిదీపాల వల్ల లభించిన ఫలితాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని పీఆర్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌ను ఆదేశించారు.

Related Posts