అల్లరి నరేష్ హీరోగా ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకునిగా పరిచయమవుతున్నారు. నరేష్ అండర్ ట్రయల్ ఖైదీగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి లాక్‌డౌన్ విధించక ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మూడు రోజుల పాటు షూటింగ్ జరిపారు. బుధవారం వర్షం రావడంతో చిత్రీకరణ నిలిపివేశారు. వాస్తవం ఇది కాగా, యూనిట్ మెంబర్స్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో షూటింగ్ నిలిపి వేశారంటూ ఆన్‌లైన్‌లో కొంతమంది ప్రచారంలోకి తెచ్చారు. దీనిని చిత్ర బృందం ఖండించింది. దయచేసి అలాంటి వదంతులను ప్రచారం చేయవద్దనీ, వాటిని నమ్మవద్దనీ కోరింది. వర్షం వల్లే చిత్రీకరణను ఆపాం తప్ప, వేరే కారణంతో కాదని స్పష్టం చేసింది. 'నాంది' అల్లరి నరేష్ నటిస్తోన్న 57వ చిత్రం. ఇప్పటివరకూ ఎక్కువ శాతం సినిమాల్లో ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ వచ్చిన ఆయన ఈ చిత్రంలో వాటికి పూర్తి భిన్నమైన, ఒక ఉద్వేగభరితమైన పాత్రను చేస్తున్నారని ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో తెలిసింది. ఈ టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. నటుడిగా అల్లరి నరేష్‌లోని మరో కోణాన్ని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. వరలక్ష్మీ శరత్‌కుమార్ లాయర్‌గా, హరీష్ ఉత్తమన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్. నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని.