విజయవాడ, ఆగస్టు 28,
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ దీనావస్థను చూసి ఆ పార్టీలో ఇప్పటికి వదల్లేక ఉన్న నేతలు నిట్టూరుస్తున్నారు. ఒక్కటిగా ఉన్న తెలుగు ప్రజలను రెండు ముక్కలు చేసిన ప్రధమ ముద్దాయి కాంగ్రెస్ నే అన్న బలమైన నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014, 2019 ఎన్నికల్లో జీరో లో అట్టేపెట్టారు హస్తం పార్టీని. అయితే పదేళ్ళు ఇలాంటి పరిస్థితి ఎపి లో ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేతలు లెక్కేశారు. కానీ మరీ ఇంత దారుణంగా గ్రాఫ్ పడిపోతుందని మాత్రం భావించలేదు. అదీ గాక వచ్చే ఎన్నికల నాటికి అయినా కనీసం లేచి నుంచుంటుందన్న నమ్మకం ఏ కాంగ్రెస్ నేతకు లేదంటే ఇక ఆ పార్టీకి ఎపి లో కాలం చెల్లినట్లే అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నవి మూడే రాష్ట్రాలు. ఇటీవల రాజస్థాన్ ను కూడా ఏ మాత్రం ఏమరుపాటు వహించినా వదులుకునేదే. అయితే చివరి నిమిషంలో రంగంలోకి దిగిన రాహుల్, ప్రియాంక గాంధీ లు అక్కడ హస్తం ప్రభుత్వం పడిపోకుండా సచిన్ పైలట్ తో సంధి చేసుకుని పార్టీని రక్షించారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో ప్రణబ్ ముఖర్జీ, అహమ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, చిదంబరం వంటి వారు ట్రబుల్ షూటర్లు గా రంగంలోకి దిగి అంతా సెట్ చేసేవారు. అయితే వృద్ధ తరం నేతల పని దాదాపు ముగిసినట్లే కనిపిస్తుంది. వారు చెబితే కుర్రోళ్ళు వినే పరిస్థితి లేదన్నది మధ్యప్రదేశ్ ఎపిసోడ్ లో జ్యోతి ఆదిత్య సింధియా ఎపిసోడ్ చెప్పక చెప్పేసింది. అలా అని వారిని విస్మరించి పక్కన పెడితే ఉన్న అరకొర ఇమేజ్ డ్యామేజ్ లో పడుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతుంది.ఇక ఎపి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీది గమ్యం లేని ప్రయాణం గా మారిపోయింది. ఆ పార్టీ ఓటు బ్యాంక్ గంపగుత్తగా వైసిపి ఫ్యాన్ కిందకు చేరిపోయినట్లు గత రెండు సార్వత్రిక ఎన్నికలు చెప్పేశాయి. అవి తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్ళే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవనే విశ్లేషకులు అంటున్నారు. మరోపక్క బిజెపి అన్ని రాష్ట్రాల్లో అధికారం కోసం వేచి చేస్తున్నట్లే తెలుగు రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు పావులు కదిపేస్తుంది. పట్టు లేకపోయినా కేంద్రం లో రెండు దఫాలుగా మోడీ చక్రం తిప్పుతూ ఉండటంతో ఏదో రకంగా ముందుకు వెళ్ళే మార్గాలను కమలం నేతలు వెతుక్కునే పనిలో బిజీ అయ్యారు. ఇవన్నీ గమనించే గత ఎన్నికల్లో సారధ్యం వహించిన రఘువీరా రెడ్డి వంటివారు మరోదఫా కూడా గట్టిగా దెబ్బ తగిలాకా కాడి వదిలేసి మడకశిర లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ నియమించిన శైలజా నాధ్ రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటిస్తున్నా గత వైభవ కాంతులు కనుచూపు మేరలో కనిపించక నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఎపి లో కాంగ్రెస్ పరిస్థితి కామ్రేడ్ ల కన్నా దీనంగా ఉందనేది తెలిసాకా ఆ పార్టీలో చేరేందుకు ఎవరు మాత్రం సాహసిస్తారు