చెన్నై, ఆగస్టు 28,
చీర మడతల్లో నుంచి నోట్ల కట్టలు బయటపడిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా కోటిన్నర విలువైన నోట్లు బయటపడ్డాయి. భారీ మొత్తంలో నగదు అక్రమంగా విదేశాలకు తరలిస్తుండగా ఎయిర్‌పోర్ట్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగుచూసింది. కొత్త షర్టులు, పట్టుచీరల మధ్య నగదు కట్టలు ఉంచి విదేశాలకు అక్రమంగా తరలిస్తుండగా చెన్నై కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు.సింగపూర్‌కి కొరియర్ చేసిన మూడు పార్శిల్స్‌పై అనుమానం వచ్చిన అధికారులు వాటిని అడ్డుకున్నారు. ఆ పార్శిల్స్‌ని తెరిచిచూడగా కొత్త షర్టులు, పట్టుచీరలు దర్శనమిచ్చాయి. వాటి మడతల్లో దాచి ఉంచి 50 వేల అమెరికా డాలర్లు, 4 వేల యూరోలతో పాటు 30 లక్షల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు కోటి 36 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వివరాలు రాబడుతున్నారు. గత వారం ప్రత్యేకంగా తయారు చేసిన స్టీల్ ప్లేట్లలో విదేశీ కరెన్సీ తరలింపును కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయినప్పటికీ స్మగ్లర్లు కొత్తకొత్త పద్ధతుల్లో అక్రమ రవాణా సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.