ఛత్తీస్ ఘడ్, ఆగస్టు 28,
సెల్‌ఫోన్ ఇవ్వలేదని చెల్లెలిని తానే గొడ్డలితో నరికేశానని చెప్పింది అక్క. అయితే ఆమె ఫోన్ కాల్ డేటా డిలీట్ చేసింది. ఇంట్లో పడి ఉన్న మాస్క్.. ఇంటి బయట బైక్ టైర్ గుర్తులు పోలీసులకు కొత్త అనుమానాలు రేపాయి.ఉదయాన్నే ఇంటి ముందు గుమిగూడిన జనాన్ని చూసి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. కంగారుగా లోపలికి వెళ్లి చూడడంతో ఇంట్లో చిన్నకూతురు విగతజీవిగా పడి ఉంది. సెల్‌ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో గొడ్డలితో నరకడంతో చనిపోయిందని అక్క చెప్పడంతో కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. అక్క హైడ్రామాకి తెరదించి ఆమె ప్రియుడితో సహా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.కోర్బా జిల్లాలోని మల్దా గ్రామానికి చెందిన బాలిక(11) దారుణ హత్యకు గురైంది. ఆమెను గొడ్డలితో నరికి అతి కిరాతకంగా చంపేశారు. పండుగని పక్క ఊరెళ్లిన తల్లిదండ్రులు ఉదయం వచ్చే సరికి ఇంటి ముందు జనం గుమిగూడి కనిపించారు. కంగారుగా లోపలికి వెళ్లడంతో చిన్నకూతురు విగతజీవిగా కనిపించింది. సెల్‌ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో తానే చెల్లిని హత్య చేశానని పెద్దకూతురు(16) చెప్పడంతో షాక్‌కి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.హత్య చేశానని చెప్పిన అక్కని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. చెల్లెలు ఉదయాన్నే సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతోందని.. తనకు ఇవ్వమని అడిగినా పట్టించుకోకపోవడంతో ఆవేశంలో గొడ్డలితో నరికి చంపేశానని చెప్పింది. అయితే ఆమె సమాధానంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఏదో విషయం దాస్తున్నట్లు అనుమానించిన పోలీసులు.. మళ్లీ అదే విషయాన్ని గుచ్చిగుచ్చి అడగడంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. మరోసారి సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇంట్లో పడి ఉన్న మాస్క్.. ఇంటి ముందు బైక్ టైర్ గుర్తులు కొత్త అనుమానాలు రేపాయి.హత్యలో మరొకరి ప్రమేయం ఉందని భావించిన పోలీసులు బాలిక ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. ఆమె సెల్‌ఫోన్ కాల్ లిస్ట్ డిలీట్ చేసినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక కాల్ డేటా పరిశీలించిన సైబర్ పోలీసులు ఒక నంబర్‌కి ఎక్కువ సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఆ నంబర్ హత్య జరిగిన రోజు రాత్రి బాలిక ఇంటి వద్దే ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక ఫోన్ చేసిన నంబర్ ఎవరిదని ఆరా తీయడంతో బిలాస్‌పూర్‌కి చెందిన వినయ్ జగత్(24)దిగా తేలింది. కట్ఘొరాలోని ఓ బ్యాంక్ రీజనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వినయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.తొలుత ఆ హత్యతో తనకేమీ సంబంధం లేదని బుకాయించిన వినయ్.. కాల్ డేటా, హత్య జరిగిన రోజు రాత్రి సెల్‌ఫోన్ సిగ్నల్ వంటి పక్కా ఆధారాలు చూపడంతో అసలు విషయం కక్కేశాడు. బాలిక తండ్రి బ్యాంక్ లోన్‌కి సంబంధించిన వడ్డీ కలెక్ట్ చేసుకునేందుకు వినయ్ ప్రతి నెలా ఇంటికి వెళ్లేవాడు. అలా కస్టమర్ పెద్ద కూతురితో పరిచయం ఏర్పడి శారీరక సంబంధానికి దారితీసింది. ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ప్రియురాలు వినయ్‌కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా చెల్లెలు నిద్రలేవడంతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఎక్కడ ఆ విషయం తల్లిదండ్రులకు చెబుతుందోనని భయపడిపోయిన అక్క.. తన ప్రియుడితో కలసి చెల్లెలిని దారుణంగా నరికి హత్య చేసింది. అనంతరం తానే చంపేసినట్లు హైడ్రామాకు తెరతీసినట్లు తేలడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.