YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆర్టీసీలో పీఎఫ్ స్కామ్

ఆర్టీసీలో పీఎఫ్ స్కామ్

హైద్రాబాద్, ఆగస్టు 28, 
ఆర్టీసీ నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో భారీ పీఎఫ్‌ కుంభకోణం చోటుచేసుకుంది. కార్మికులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల పాలయ్యాయి. ఐదు బినామీ పేర్లతో కాంట్రాక్టర్‌ అవతారమెత్తిన ఓ అవినీతి అధికారి ఈ కుంభకోణానికి పాల్పడ్డాడు. ఐదు నెలల క్రితమే 'ఆర్టీసీ ఉద్యోగి.. కాంట్రాక్టర్‌ అవతారం' అంటూ నవతెలంగాణ ప్రచురించిన కథనంలోని సదరు అధికారే ప్రస్తుత పీఎఫ్‌ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి. కార్మికుల వేతనాల నుంచి ప్రతినెలా రెండు వేలు కోత విధిస్తూ జేబులో వేసుకోవడంతో పాటు పీఎఫ్‌ను సైతం జమ చేయకుండా కాజేశాడు. ఇంత చోద్యం జరుగుతున్నా ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీలో స్వీపింగ్‌, బస్‌ వాషింగ్‌, సెక్యూరిటీ, ఆయిల్‌ టాప్‌అప్‌, ట్రాఫిక్‌ గైడ్స్‌ ఇలా పలు విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో కార్మికులను నియ మించుకున్నారు. నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఆరు బస్టాండ్లు సహా డిపోల్లో అదే ప్రాతిపదికన కార్మికులను తీసుకున్నారు. లైసెన్స్‌లు కలిగిన కాంట్రాక్టర్లతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం రీజియన్‌ పరిధిలో 151 మంది కార్మికులు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారు. గతంలో 200 మంది వరకు పనిచేసినా కరోనా నేపథ్యంలో బస్సులన్నీ నడవక ఆర్టీసీ కార్మికులనే కొన్ని పనుల్లో నియమించారు. కొందరిని తొలగించారు. ఇదే అదనుగా అకౌంట్‌ విభాగంలో పనిచేసే సదరు అధికారికి కాంట్రాక్టులపై కన్ను పడింది. గతంలో ఆర్టీసీలో అధికారిక యూనియన్‌ సంఘం హవా నడుస్తున్న సమయంలో 2017 నుంచి సదరు అధికారి కాంట్రాక్టర్‌ అవతారమెత్తాడు. అకౌంట్‌ విభాగం కావడంతో అప్పటివరకున్న కాంట్రాక్టర్ల బిల్లులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశాడు. బిల్లుల్లో తప్పులున్నాయని విసిగివేసారేలా చేయడంతో చాలమంది కాంట్రాక్ట్‌ రద్దు చేసుకున్నారు. వెంటనే సదరు అధికారి అల్లుళ్లు, ఇతర కుటుంబ సభ్యుల పేర ఆ కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఆఫీసులో పని పక్కనబెట్టి యథేచ్ఛగా కాంట్రాక్టులు నిర్వహించుకున్నాడు. ఆర్టీసీలో స్కీల్డ్‌ (రూ.12,550), సెమిస్కిల్డ్‌(రూ.10,222), అన్‌స్కిల్డ్‌ (రూ.8,658) చొప్పున వేతనాలు అందజేయాల్సి ఉన్నా.. ఒక్కో కార్మికుడి నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేలు కోత విధించి జేబులు నింపుకున్నాడు. ఈ పర్వాన్ని 'నవతెలంగాణ' మార్చి నెలలో వెలుగులోకి తెచ్చినా నేటికీ చర్యలు తీసుకోలేదు. కరోనా నేపథ్యంలో కొన్ని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల స్థానంలో సంస్థ కార్మికులను నియమించారు. దీంతో సుమారు 80 మంది వరకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు రోడ్డునపడ్డారు. కరోనా నేపథ్యంలో పీఎఫ్‌ డబ్బులతోనైనా కుటుంబాలు గడుపుకుందామకున్న కార్మికులు ఒక్కసారిగా షాకయ్యారు. అసలు చాలామందికి పీఎఫ్‌ జమకాలేదు. కొందరికి అరకొర వేశారు. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన కార్మికులను సదరు అధికారి దుర్భాషలాడుతూ తిప్పి పంపినట్టు బాధితులు వాపోయారు.కార్మికులకు అందజేసే వేతనాల్లోంచి 25 శాతం పీఎఫ్‌ జమచేయాల్సి ఉంటుంది. అందులో కాంట్రాక్టర్‌ 12 శాతం, సంస్థ 13 శాతం జమచేయాలి. ఒక్క సెమిస్కిల్డ్‌ కార్మికునికి ఉదాహరణకు రూ.10,222 వేతనం ఉంటే పీఎఫ్‌ కింద ప్రతినెలా రూ.2,555 జమచేయాలి. సంస్థ నుంచి 13 శాతం అంటే 1,328 జమచేయాలి. పీఎఫ్‌లో కలపాల్సిన ఆ డబ్బులను సైతం సదరు కాంట్రాక్టరే (అవినీతి అధికారి) మింగేశాడు. ఇలా ఒక్కో కార్మికుడికి నెలకు రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30 వేలు, రెండేండ్లకు రూ.60 వేల చొప్పున కోల్పోయారు. అందులో సదరు అవినీతి అధికారి బినామీ పేర్ల మీద నిర్వహించిన కాంట్రాక్టుల్లో కనీసం 120 మంది వరకు కార్మికులుంటారు. న్యాయంగా వారికి దక్కాల్సిన రూ.72 లక్షలు కాజేశారు. దీనికి అదనంగా సంస్థ నిర్ధారించిన కనీస వేతనాలను కార్మికులకు అందనీయలేదు. అన్‌స్కిల్డ్‌ కార్మికుల(స్వీపర్లు, బస్‌ వాషింగ్‌)కు సంస్థ రూ.8 వేల చొప్పున ప్రతినెలా అందజేస్తుండగా.. కేవలం రూ.5 వేల నుంచి రూ.6 వేలే చెల్లించారు. అందులోనూ నెలకు వీక్లీఆఫ్‌లు లేకుండా నెలకు నాలుగు రోజుల వేతనం కోత విధించేవాడు. ఆ విధంగా మరో రూ.70 లక్షలు వెనకేసుకున్నాడు. మొత్తంగా కోటీన్నర వరకు కార్మికులకు దక్కాల్సిన పీఎఫ్‌, వేతనం లేకుండా పోయింది.వ్యవస్థీకృతంగా దోపిడీకి జరిగినా ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ నుంచి డిపో మేనేజర్ల వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం లేని ప్రశ్న. సాధారణంగా ఆర్టీసీలో ఒక్క బిల్లు ఆమోదం పొందాలన్నా క్లర్క్‌, సూపరింటెండెంట్‌, డిపో మేనేజర్‌, అడిట్‌ క్లర్క్‌, అడిట్‌ సూపరింటెండెంట్‌, అకౌంట్‌ ఆఫీసర్‌ ఇలా పలువురు సంతకాలు చేయాల్సి ఉంటుంది. పెద్దఎత్తున వేతనాలతో పాటు కార్మికుల పీఎఫ్‌ డబ్బులు పక్కదారి పడుతున్నా వారంతా చూసీచూడనట్టు ఎందుకు వ్యవహరించారో తేలాల్సి ఉంది. అధికార సంఘం అండదండలు, సంస్థలో ఉన్న ఉద్యోగం దుర్వి నియోగం చేస్తూ కొందరిని బెదిరించి, మరికొందరి చేతులు తడుపుతూ బిల్లులు క్లియర్‌ చేసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డిపో మేనేజర్లకు నజరానాలు ఇస్తూ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు తెలిసింది.

Related Posts