అమరావతి ఆగష్టు 28
ఇప్పటికే మనబడి నాడు–నేడు ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దిన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సిలబస్ ను మార్చింది. విద్యార్థులకు సులభంగా ఉండేలా విద్యారంగ నిపుణులతో సరికొత్తగా పాఠ్యాంశాలను రూపొందించింది. ఈ పుస్తకాలను సరికొత్తగా మిర్రర్ ఇమేజ్ తరహాలో ఒక పేజీలో తెలుగు ఎదుటి పేజీలో ఇంగ్లిష్ లో పాఠ్యాంశాలు ఉండేలా రూపొందించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ నిపుణుల సహకారంతో తెలుగు–ఇంగ్లిష్ భాషల్లో తొలిసారిగా రూపొందించిన మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలను ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అందించనున్నారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగుఇంగ్లీష్ గణితం సిలబస్లో మార్పులు చేశారు. ఈవీఎస్ ఇకపై 3వ తరగతి నుంచి ఉండేలా సిలబస్ రూపకల్పన. ఆరో తరగతిలో సోషల్ హిందీ పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు. ఈఏడాది తొలిసారిగా ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించనున్నారు. గతంలో కేవలం 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు మాండలికాలు సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యాంశాలుగా చేర్చారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రాధమిక విద్యలో సెమిస్టర్ విద్యా విధానం అమలులోకి తెస్తున్నారు. పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందచేస్తారు. దీనివల్ల పుస్తకాల బరువు భారం చాలావరకు తగ్గుతుంది.