అమరావతి ఆగష్టు 28
ఈఎస్ఐ కుంభకోణం కేసులో జూన్ 12 న అరెస్ట్ అయ్యి గత కొన్ని రోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్న మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి నేడు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఆయన వేసిన బెయిల్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదని..అలాగే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని న్యాయస్థానం సూచించింది. కాగా అనారోగ్యం బారినపడ్డ అచ్చెన్నాయుడికి ప్రభుత్వం రమేష్ ఆస్పత్రి ఎన్ ఆర్ ఐ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించింది. ఇదే తరుణంలో ఆయనకి కరోనా సోకగా ..కొద్ది రోజుల క్రితం కరోనా పాటిజివ్ రావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈఎస్ ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు 76 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. ఇక బెయిల్ కోసం అచ్చెన్నాయుడు గతంలో రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమవడం తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే .. ఈఎస్ ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడిని జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే అప్పటికే సర్జరీ కారణంగా ఇబ్బంది పడుతున్న అచ్చెన్నాయుడును ఆస్పత్రిలో చేరేందుకు కోర్టు అనుతిచ్చింది. ఆ తరువాత ఏసీబీ అధికారులు ఆయనను ఆస్పత్రిలోనే విచారించారు. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు.