న్యూ ఢిల్లీ ఆగష్టు 28
కరోనా నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. మాయదారి మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయిన పరిస్థితి. మిగిలిన రంగాల విషయం ఒక పక్కన పెడితే.. విద్యా వ్యవస్థకు సంబంధించి పలు సందేహాలు నెలకొన్న పరిస్థితి. ఇప్పటికే పలు పరీక్షలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేసేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. విశ్వ విద్యాలయాలు.. కాలేజీల్లో చదివే ఫైనల్ ఇయర్ విద్యార్థుల మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది.దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. తాజాగా సుప్రీం కోర్టు ఈ అంశంపై స్పష్టత ఇచ్చేసింది. ఫైనల్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని.. అయితే.. తమకున్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని పరీక్షల్ని వాయిదా వేయొచ్చని పేర్కొంది.కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం పరీక్షల్ని వాయిదా వేయొచ్చని చెప్పటం ద్వారా.. ఆయా తరగతుల విద్యార్థులు ఇవాళ కాకున్నా.. తర్వాత అయినా పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంది. అంతే తప్పించి.. మిగిలిన తరగతుల మాదిరి పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసే అవకాశం లేదని స్పష్టమైనట్లే. ఫైనల్ ఇయర్ విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రమోట్ చేయొద్దని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.యూజీసీ తో సంప్రదించి పరీక్షల నిర్వహణ తేదీల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేయొచ్చన్నారు. యూజీసీ ప్రకటించిన సెప్టెంబరు 30 కటాఫ్ ను రాష్ట్రాలు తప్పని సరిగా పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు తప్పనిసిరి అన్న యూజీసీ మార్గదర్శకాలు సరైనవేనని తేల్చింది. దీంతో..ఫైనల్ ఇయర్ విద్యార్థుల పరీక్షల విషయం లో సుప్రీం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి.. ఇష్యూ ను క్లోజ్ చేసినట్లేనని చెప్పక తప్పదు.