బెర్లిన్ ఆగష్టు 28
ఇటీవల కొంతమందికి టాటూల పిచ్చి పీక్స్ కు చేరింది. ఒళ్ళంతా ఎక్కడపడితే అక్కడ టాటూలు వేయించుకుంటున్నారు. బాలీవుడ్ నటుల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ. టాలీవుడ్ లోనూ హీరో నాగార్జున హీరోయిన్లు త్రిష సమంత సహా పలువురు టాటూలు వేయించుకున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి టాటూలంటే భలే ఇష్టం. అతడు శరీరంలో పలుచోట్ల టాటూ వేయించుకున్నాడు. అయితే టాటూలపై పిచ్చి ఉండొచ్చుకానీ.. మరీ అది పైత్యానికి దారి తీస్తే చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుంది. జర్మనీకి చెందిన కళాకారుడైన సాండ్రోలా అదే పని చేశాడు.అతడికి టాటూలంటే పిచ్చి.. పైత్యం. అతడు ఒళ్ళంతా టాటూలు వేసుకొని చివరికి భయంకరంగా తయారయ్యాడు. ఇప్పుడు అతడిని చూస్తేనే జనం జడుసుకుంటున్నారు. ఇప్పటివరకు అతడు టాటూల కోసం రూ. 6 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. 17 సార్లు సర్జరీ కూడా చేయించుకున్నాడు. నాలుకను రెండు సమభాగాలుగా చేసి టాటూ వేయించుకున్నాడు. ఇక వెరైటీగా ఉంటుందని తన రెండు చెవులను కట్ చేయించుకుని ఆ ప్రాంతంలో కూడా టాటూలు వేయించుకున్నాడు. అవి పాడవకుండా జాడీలో భద్రపరిచాడు. ఇన్ని పిచ్చి పనులు చేస్తే చేశాడు. వాటిని వీడియోలుగా తీసి ఇన్ స్టా గ్రామ్ లో పెడుతుంటాడు. ఇతడి ఫోటోలు వీడియోలు చూసిన నెటిజన్లు జడుసుకుంటున్నారు.టాటూల కోసం చెవులు తొలగించుకోవడం ఏమిటని అసహ్యించుకుంటున్నారు. ఫొటోలు చూస్తే చాలు గగుర్పాటు కలుగుతోందని మండిపడుతున్నారు. అయితే సాండ్రోలా మాత్రం తనను ఇలా ఎవరైనా విమర్శిస్తే తనకింకా ఆనందంగా ఉంటుందని మరిన్ని టాటూలు వేసుకోవడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని అంటున్నాడు. తొందర్లో ముక్కును కూడా తొలగించి టాటూ వేయించు కోవాలనుకుంటున్నట్లు సాండ్రోలా చెప్పాడు. ఎవరి పిచ్చి వాళ్లకు మహానందమంటే ఇదే మరి.