కర్నూలు, ఆగస్టు 28
కర్నూలు జిల్లలో పేకాట క్లబ్ వ్యవహారం సంచలనరేపుతోంది. పోలీసుల దాడుల తర్వాత అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏపీ మంత్రి జయరాం సోదరుడు నారాయణను చిప్పగిరి పోలీసులుఅ అదుపులోకి తీసుకున్నారు.. అలాగే ఆయన అనుచరులు జగన్, శ్రీదర్‌లను కూడా అరెస్ట్ చేశారు.గుమ్మనూరు పేకాట క్లబ్ నిర్వహణలో గుమ్మనూరు నారాయణ కీలకంగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం కర్నూలు జిల్లా గుమ్మనూరులో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 40 వాహనాలు, రూ.5.44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 33 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వచ్చారన్న సమాచారం కొందరు పోలీసులపై ఒక్కసారిగా ఎదురు దాడికి పాల్పడ్డట్లు సమాచారం. కారంపొడి పోలీసులపై చల్లుతూ పేకాటరాయుళ్లు తిరగబడ్డట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే మంత్రి అనుచరులు ఈ క్లబ్ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు రావడంతో జయరాం స్పందించారు. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోనని తేల్చిచెప్పారు. తాను, తన సోదరులు ఆలూరులోనే ఉంటామని.. గుమ్మనూరు స్వగ్రామమే అయినా తన కుటుంబ సభ్యులంతా ఉండేది మాత్రం ఆలూరులో అన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగినా తాను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని.. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించవద్దని, చట్టప్రకారం చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు