ఇచ్చాపురం, ఆగస్టు 29,
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది.. ఫ్యాన్ గాలిని తట్టుకుని విజయం సాధించారు. వారిలో ముగ్గురు అధికార పార్టీకి జై కొట్టారు. మిగిలినవారిలో కూడా కొందరు గోడ దూకేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ సత్తాచాటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైకిల్‌కు ఓటేసినా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీ నేతల దెబ్బకు ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కుమార్ ఇబ్బందిపడుతున్నారట.ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న పిరియా సాయిరాజ్ ఫ్యామిలీ ఎమ్మెల్యేను బయట అడుగుపెట్టనివ్వకుండా చెక్ పెడుతోందట. అధికారిక, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా అశోక్‌ను పిలవాల్సి ఉన్నా అలా జరగడం లేదట. అధికారికంగా నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ అశోక్‌ను అడుగుపెట్టనివ్వడం లేదట. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే రాకముందే వైఎస్సార్‌సీపీ నేతలు పూర్తి చేస్తున్నారట.రెండు, మూడు సార్లు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారట. వైఎస్సార్‌సీపీ నేతల తీరుకు నిరసనగా ప్రొటోకాల్ పాటించడం లేదని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఎమ్మెల్యే గంటల తరబడి నిరసన తెలిపారట. 6 నెలల కిందట పలాసపురంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై అధికార పార్టీ శ్రేణులు దాడికి యత్నించడం హాట్‌టాపిక్ అయ్యింది. ఆ సమయంలో అశోక్‌కు అండగా ఉన్నామంటూ పార్టీ ముఖ్యనేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు ఇతర జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. కలెక్టర్‌పై ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందట. మరి ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీ ఎలా డీల్ చేస్తుందన్నది చూడాలి.