విజయవాడ, ఆగస్టు 29,
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కార్యకలాపాలు పూర్తిగా స్థంభించిపోయాయి. అసలే క్షేత్రస్థాయిలో క్యాడర్ లేక విలవిలలాడుతున్న పార్టీకి కరోనాతో మరింత డీలా పడిందనే చెప్పాలి. జనసేన కంటే ఏపీలో ఇప్పుడు దాని మిత్రపక్షమైన బీజేపీయే యాక్టివ్ గా ఉందని చెప్పుకోవాలి. దాదాపు ఎన్నికల ఫలితాల నుంచి జనసేనలో ఇదే పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు సమయానికి జరిగి ఉంటే కొంత జనసేన యాక్టివ్ అయి ఉండేది. కానీ అవి కూడా వాయిదా పడటంతో ఇప్పుడు అధినేత బాటలోనే క్యాడర్ కూడా నడుస్తుంది.జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కరోనా తగ్గుముఖం పట్టినా ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తిగా పాల్గొనలేని పరిస్థితి. నాలుగు సినిమాల వరకూ పవన్ కల్యాణ‌్ ఓకే చేయడంతో ఇప్పట్లో రాజకీయ కార్యక్రమాలను పవన్ కల్యాణ్ చేపట్టలేనట్లే. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడికి ఏమాత్రం కొదవలేదు. రోజూ ఏదో ఒక అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై నిరసనలకు దిగుతున్నాయి. కానీ జనసేన మాత్రం నాయకత్వం దిశానిర్దేశం లేక చేష్టలుడిగి చూస్తూనే ఉంది.జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత నెంబర్ 2 స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ముఖ్యమైన నిర్ణయాలన్నింటిలోనూ పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. బీజేపీ తో పొత్తు సమయంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కల్యాణ్ వెన్నంటే నాదెండ్ల మనోహర్ నడిచారు. అభ్యర్థుల ఎంపికలోనూ నాదెండ్ల మనోహర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన కూడా పార్టీని బలోపేతం చేయడంపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదు.పవన్ కల్యాణ్ ను కాదని జనసేనలో నాదెండ్ల మనోహర్ కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడం వల్లనే ఆయన దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నా నాదెండ్ల మనోహర్ లాంటి నేతలు జిల్లా స్థాయి పర్యటనలు చేస్తే జనసేన క్యాడర్ లో కొంత జోష్ పెరుగుతుందంటున్నారు. కానీ నాదెండ్ల మనోహర్ కూడా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. దీంతో జనసేన ఏపీలో బీజేపీ కంటే ఘోరంగా ఉందంటున్నారు.