విద్యార్థులు, యువకుల బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో.. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదట మోసం చేసింది దళితులనేనని, తొలి దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి హామీలను పూర్తిగా విస్మరించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి దళిత్ అదాలత్‌లను నిర్వహిస్తూ వస్తోందని డాక్టర్ కె లక్ష్మన్ తెలిపారు.గ్రామ స్వరాజ్ అభియాన్‌లో్ భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం మందమర్రిలో నిర్వహించిన దళిత్ అదాలత్‌లో డాక్టర్ లక్ష్మన్ మాట్లాడుతూ....పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ ను రెండుసార్లు ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌దని, బాబూ జగ్జీవన్ రామ్‌ను ప్రధాని కాకుండా అడ్డుకున్నది కూడా కాంగ్రెస్ కాదా..? అని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు. జనతా పార్టీ నేతృత్వంలో జగ్జీవన్‌రామ్‌ను ప్రధాని అభ్యర్థిగా అన్ని పార్టీలు మద్ధతు ప్రకటిస్తే.. ఆనాడు జగ్జీవన్ రామ్‌ను ప్రధాని కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. దళితులను అడుగడునా అణచివేతకు గురి చేసిన కాంగ్రెస్ .. ఇవాళ దళితుల జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ దళితులను కేవలం ఓటర్లుగానే పరిగణించింది తప్పా.. ఏనాడూ వారి అభ్యున్నతికి పాటు పడలేదని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. కాంగ్రెస్‌కు అస్తమానం అధికారంపై ఉన్న మమకారం పేదప్రజలపై లేదని, అధికారం కోసం అర్రులు సాస్తున్న కాంగ్రెస్ అట్టడుగు వర్గాలకు చేసిందేమీ లేదని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.
అంబేద్కర్ ఆశయాలను, భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రాంతాలైన మౌ గ్రామం, న్యూఢిల్లీ, నాగ్‌పూర్, లండన్ వంటి ప్రాంతాలను పర్యాటక, స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేసిందన్నారు.
రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పిన కేసీఆర్.. తీరా అధికారంలోకి వచ్చాక తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని, కేసీఆర్ తొలుత వంచించింది దళితులనేనని డాక్‌్ర్ లక్ష్మన్ దుయ్యబట్టారు. దళిత ఉపముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను ఉన్నపళంగా ఎందుకు తొలగించాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సూర్యపేటలో ప్రభుత్వ భూముల వ్యవహరంలో.. మంత్రి జగదీష్‌రెడ్డి వందల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పత్రికలు కోడై కూస్తున్నా... ఆయనపై ఎందుకు చర్చలు తీసుకోవడం లేదని డాక్టర్ లక్ష్మన్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళితుడైన రాజయ్యకు ఒకనీతి..మత్రి జగదీష్‌రెడ్డికి మరో నీతా..? అని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారని, ప్రతిఏటా 10 వేల ఎకరాలు భూములను పంపిణీ చేస్తామని చెప్పారని..కానీ నాలుగేళ్లలో 10 వేల ఎకరాలు కూడా పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం.. అటకెక్కించి పేదవాడి సొంతింటి కలను వమ్ము చేశారన్నారు. ఎస్సీల సంక్షేమం ప్రతిఏటా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారని, కానీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కు నిధులు కేటాయించి ఖర్చు పెట్టలేని దుస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. నాలుగేళ్లలో 40 వేల కోట్లు ఖర్చుపెట్టాల్సిన ప్రభుత్వం..కేవలం 17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులపుకొందన్నారు.ట్యాంక్‌బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు కొమరం భీమ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నాలుగేళ్లయినా అందుకోసం చర్యలు తీసుకోలేదని డాక్టర్ లక్ష్మన్ దుయ్యబట్టారు. ఎస్సీల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ఇసుక మాఫియా వల్ల ప్రమాదాలు జరిగి పల్లెల్లో ప్రాణాలు పోతున్నాయని ప్రశ్నించిన నేరేళ్ల దళిత యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిన పాపం టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.
10 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లాయని స్వయంగా కాగ్ ఎత్తిచూపిందని, అయినా కేసీఆర్ ప్రజలను, ప్రతిపక్షాలను మభ్యపెడుతూనే ఉన్నారని డాక్టర్ లక్ష్మ న్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని డాక్టర్ లక్ష్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నార్కాట్‌పల్లిలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని,
భద్రాద్రి జిల్లాలో మున్సిపల్ కమిషనర్ మందరవిపై టీఆర్ ఎస్ నేతలు దాడి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ దళిత మహిళా సర్పంచ్‌కి జరిమానా విధించిన ఉదంతం సిగ్గుచేటని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7032 దాడులు జరిగితే.. ఇంతవరకు ఎవరినీ శిక్షించలేకపోయారని, 2016లో ఎస్సీలపై దాడులకు సంబంధించి 40 వేల దాడుల కేసులు , ఎస్టీలపై 6500 కేసులు నమోదయినా... వాటి విచారణలో ఇంకా అతిగతీ లేదన్నారు.పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి నరేంద్రమోదీ.. దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ఓ పేద వ్యక్తి దేశ ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్.. ప్రధాని పట్ల చౌకబారు విమర్శలు చేయడం శోచనీయమన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 40 శాతం జనాభాకు కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, మోదీ ప్రధాని అయిన తర్వాత ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చి.. వాటికి ఆత్మగౌరవాలయాలుగా నామకరణం చేశారన్నారు. తన తల్లి వంటింట్లో కట్టెల పొయ్యితో వంటచేస్తూ... పడిన కష్టాలు చూసిన మోదీ.. ఏ తల్లికి అలాంటి కష్టం రాకూడదన్న సంకల్పంతో దాదాపు 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. పొగబారిన బతకులకు విముక్తి కల్పించి.. పేదల జీవితాల్లో ఉజ్వల పథకం ద్వారా వెలుగులు నింపుతున్నారన్నారు. పేదలు, దళితుల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ అహర్నిశలు కష్టపడుతున్నారని, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తి కుటుంబానికి 4 లక్షల ఆర్థిక సాయం కేంద్రం చేస్తుందన్నారు. బేటీ పడావో-బేటీ బచావో పథకం ద్వారా బాలికా సంరక్షణ పథకాన్ని అమలు చేస్తోందని, గర్భిణీ స్త్రీలకు, తల్లీ బిడ్డల క్షేమం కోసం మానవీయ కోణంలో మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. జన్‌ధన్ పథకం ద్వారా రూపాయి లేకున్నా 32 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించారన్నారు.
దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం కోసం మోదీ ప్రభుత్వం... 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలిచ్చి ఉపాధి చూపారని, నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 45 వేల మంది దళితులను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. అలాగే ముద్రా యోజన పథకం ద్వారా దాదాపు 79 శాతం దళితులు లబ్ధి పొందుతున్నారన్నారు. పేదలకు గుండెజబ్బులు వంటి పెద్దజబ్బులు వచ్చినప్పుడు.. ఆయుస్మాన్ భారత్ పథకంలో భాగంగా మోదీ ప్రభుత్వం 30 వేలకే స్టంటు అందిస్తున్నదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.అవినీతి అక్రమాలకు తావులేని నరేంద్రమోదీ పాలన పట్ల యావత్ దేశప్రజానీకం ఆకర్షితులవుతున్నారని, దేశంలోని 21 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రాగలిగిందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. సబ్ కా సాత్-సబ్ కా వికాస్ నినాదంతో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దేశాన్ని పాలిస్తున్నఏకైక పార్టీ బిజెపి అని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బిజెపికి అధికారంలోకి వచ్చేలా అన్ని వర్గాల ప్రజలు బిజెపికి మద్ధతు తెలపాలని డాక్టర్ లక్ష్మన్ కోరారు. దళితుల అభ్యున్నతి కోసం మొదటి నుంచి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది కేవలం బిజెపి మాత్రమే అని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.
దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని, 2019 లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, దళితులు, మహిళలు, కార్మికులు, కర్షకులు బిజెపితో కలిసి రావాలని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు.