విశాఖపట్నం ఆగష్టు 29
విశాఖపట్నంలో కలకలం సృష్టించిన దళిత యువకుడి శిరోముండనం కేసులో పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఈ కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేస్ ఫైల్ చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుసమాచరం. దీనితో ఈ కేసులో నూతన్ నాయుడు భార్యతో పాటు మిగతావారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఓ వార్త ప్రచారం అవుతుంది. ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు యువకుడికి శిరోముండనం ఘటనకు వ్యతిరేకంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కాగా విశాఖ నగర శివారులో జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చెప్పా పెట్టకుండా పనిలోకి రావడం మానేశాడన్న కోపంతో కర్రి శ్రీకాంత్ అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. నిన్నమధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని శ్రీకాంత్ ను పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారట. దీంతో అతను తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.