టీడీపీ-బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీని తెలుగుదేశం శ్రేణులు ఏ రేంజ్ లో విమర్శిస్తున్నాయి. ఇటు కమలం పార్టీ కూడా అందుబాటులో ఉన్న ప్రతీ ఛాన్స్ ను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకాన్నీ వ్యతిరేకిస్తోందని టాక్. తిరుమల దేవస్థానం ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై హిందూత్వ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. క్రైస్తవ మతాభిమాని అయిన పుట్టా ఆయనకు టీటీడీ పదవి ఎలా కట్ట బెడతారంటూ మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతూ విశ్వ హిందూ పరిషత్.. తెలంగాణా విభాగం లేఖాస్త్రం సంధించింది. ఈ లేఖ వెనుక బీజేపీ హ్యాండ్ ఉండొచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీని కార్నర్ చేసేందుకు ఈ ఇష్యూను హైలెట్ చేస్తోందని హిందూత్వ సంఘాలతో విమర్శలు చేయిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
టిటిడి ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమిస్తున్నట్లు తేలగానే ముందుగా ఆర్ ఎస్ ఎస్ వ్యతిరేక గళం వినిపించింది. తర్వాత వివిధ పీఠాధిపతులు విమర్శలు ప్రారంభించారు. సుధాకర్ యాదవ్ క్రైస్తవ సంస్థలతో సన్నిహితమని, పలుమార్లు ఆయన క్రిస్టియన్ సభలకు హాజరయ్యారని విమర్శకులు అంటున్నారు. హిందూ ధర్మంపై పూర్తి విశ్వాసం ఉన్నవారికే ఈ పదవి కట్టబెట్టాలనేది వీరందరి వాదన. అయితే టీటీడీ ఛైర్మన్ రేసులో పుట్టా సుధాకర్ ఉన్నట్లు దాదాపు 10 నెలలుగా టాక్ నడిచింది. అప్పట్లో ఇలాంటి విమర్శలేవీ వినిపించలేదు. కానీ బీజేపీ-టీడీపీలు విడిపోయాక మాత్రం సుధాకర్ నియామకం తప్పు అంటూ పలువురు రాద్ధాంతం చేస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేకున్న తర్వాత టీటీడీ ఛైర్మన్ నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత స్వేచ్ఛగానే నిర్ణయం తీసుకున్నారు. నెలల తరబడి ఖాళీగా ఉన్న పదవికి పుట్టా సుధాకర్ ను ఎన్నుకున్నారు. ప్రస్తుతం టీడీపీ తమ మిత్రపక్షం కాదు కనుక ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బీజేపీ తెగ ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే పుట్టా నియామకంపై రేగిన వివాదాన్ని కాషాయ పార్టీ విస్తృతం చేస్తోందని వినికిడి. సూధాకర్ నియామకంపై జీఓ విడుదల కాలేదు. అధికారిక ప్రకటన లేకుండానే ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో టీటీడీ ఛైర్మన్ నియామకంపై ముఖ్యమంత్రి పునరాలోచించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా టీటీడీ ఛైర్మన్ ఇష్యూ తెలుగురాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.