YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

2వ సారి సోకుతున్న కరోనా

2వ సారి సోకుతున్న కరోనా

న్యూఢిల్లీ, ఆగస్టు 29
కరోనా రెండోసారి సోకుతోంది. ఇప్పటికే పలు ఘటనల్లో ఇది రుజువైంది. అయితే.. అమెరికాలో ఓ కేసులో మరింత ఆందోళన కలిగించే విషయం బయటపడింది. రెండోసారి  కరోనా సోకిన ఓ యువకుడిలో తీవ్రమైన లక్షణాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు నమోదైన కేసులకు భిన్నంగా రెండోసారి నమోదైన కేసులో మొదటిసారి కంటే తీవ్ర  స్థాయిలో లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల యువకుడిలో ఈ తరహా లక్షణాలు గుర్తించినట్లు ఓ అధ్యయనంలో
పేర్కొన్నారు. అయితే.. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.హాంకాంగ్‌లో తొలిసారిగా రీఇన్‌ఫెక్షన్‌ కేసు నమోదైంది. ఐరోపాలోని పలు దేశాల్లోనూ రెండోసారి వైరస్‌ సోకినట్లు  వార్తలు వచ్చాయి. భారత్‌లోనూ ఒకట్రెండు కేసుల్లో రెండోసారి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. వీటిని అధికారికంగా ధ్రువీకరించలేదు. రెండోసారి కరోనా  బారినపడటంపై కలకలం కొనసాగుతున్న వేళ అమెరికాలో నమోదైన తాజా కేసు మరింత ఆందోళనకు తావిస్తోంది.హాంకాంగ్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రెండోసారి కరోనా వైరస్‌  సోకినట్లు వెల్లడించారు. కానీ, లక్షణాలు మాత్రం కనిపించలేదని పేర్కొన్నారు. దీంతో రెండోసారి కరోనా సోకితే పెద్దగా ప్రమాదమేమీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, నెవాడాలో నమోదైన కేసు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.నెవాడాలో ఏప్రిల్‌లో తొలిసారి వైరస్‌ బారినపడ్డ ఆ యువకుడు అదే నెల 27 నాటికి కోలుకున్నట్లు  అధ్యయనంలో పేర్కొన్నారు. ఆ తర్వాత రెండుసార్లు చేసిన నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్‌‌గా తేలినట్లు వెల్లడించారు. అయితే.. సదరు యువకుడు నెల తర్వాత మళ్లీ అనారోగ్యం  బారిన పడ్డాడు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఒకే వ్యక్తికి పలుమార్లు కొవిడ్‌-19 సోకే ప్రమాదం ఉందని ఈ కేసు ద్వారా స్పష్టమవుతోంది.రెండోసారి కరోనా  సోకిన ఆ యువకుడిలో జ్వరం, తలనొప్పి, జలుబు, డయేరియా లాంటి లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది  పడుతుండటంతో కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.తాజా కేసును నెవాడా స్టేట్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీ పరిశోధకులు సీరియస్‌గా తీసుకున్నారు.  అధ్యయనం మొదలుపెట్టారు. రెండోసారి సోకిన వైరస్‌ జన్యుక్రమం తొలిసారి సోకిన దాని జన్యుక్రమం కంటే భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. అంటే కరోనా వైరస్‌లో మరో రకం  వైరస్ ఆ యువకుడికి సోకినట్లు భావిస్తున్నారు. వివిధ దేశాల్లో ఈ వైరస్ రూపాంతరం చెందినట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

Related Posts