న్యూఢిల్లీ, ఆగస్టు 29
ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షల అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. ఈ పరీక్షలను నిర్వహించడానికి కేంద్రం సిద్ధపడుతుండగా.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పరీక్షల నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ విషయంలో తీర్పును సమీక్షించాలని కోరుతూ మొత్తం ఆరు రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్రలు ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడానికి అనుమతించవద్దని కోరాయి.నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఆగస్టు 17న తిరస్కరించిన సుప్రీంకోర్టు.. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం భావ్యం కాదని వ్యాఖ్యానించింది. రెండు రోజుల కిందట బీజేపీయేతర ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించిన సమావేశంలోనూ నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణను వ్యతిరేకించాలని నిర్ణయించారు.ప్రస్తుతం తరుణంలో జేఈఈ, నీట్ నిర్వహణలో కేంద్రం ముందుకు సాగడం రాష్ట్రాలకు భారమవుతుందని, చివరికి ఇది మన నెత్తికి చుట్టుకుంటుందని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అన్నారు. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి తీసుకురావడానికి అనేక రాష్ట్రాలు జాగ్రత్తగా పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో కోవిడ్-19 కేసుల తీవ్రతను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయి.మరోవైపు, చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈమేరకు యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు సరైనవేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం.. కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసే అధికారం రాష్ట్రాలకు ఉందని పేర్కొంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి.. సెప్టెంబర్ 30 తర్వాతి తేదీకి పరీక్షలు వాయిదా వేయాలని భావిస్తే.. కొత్త పరీక్ష తేదీ కోసం రాష్ట్రాలు యూజీసీ సంప్రదించాలని సూచించింది.