జీవితంలో ప్రతి మలుపును, మార్పును కాలానికే వదిలివేయడం సామాన్యుల స్వభావం. స్వప్రయత్నాన్ని నమ్ముకొని ఆశించిన లక్ష్యాలను అందుకోవడం అసామాన్యుల లక్షణం. పుట్టుక, పరిసరాలు, దేహవర్ణం, బంధువర్గం తదితర విషయాల్లో మనం స్వతంత్రులం కాకపోవచ్ఛు ఆ పరమాత్మ ఎక్కడ పరిచయం చేస్తే అక్కడి నుంచే మన జీవితాన్ని ఆరంభించడం అనివార్యమే కావచ్ఛు స్వప్రయత్నంతో మన గమ్యాన్ని మనమే నిర్దేశించుకోవచ్ఛు మన తొలి అడుగు ఎక్కడి నుంచి వేసినా, తుది అడుగు మాత్రం అనుకున్న గమ్యానిదే కావచ్ఛు మన జన్మ యాదృచ్ఛికమే అయినా, జీవన సాఫల్యం మాత్రం పురుష ప్రయత్నం పైనే ఆధారపడి ఉంటుంది. మన కృషికి దక్కే ఫలితమే మన కనుల ముందుండే జీవితం. ఒక్కమాటలో జన్మబంధాలు పుట్టుమచ్చల్లాంటివి; సాధించే విజయాలు- పచ్చబొట్టుల్లాంటివి.
ఈ లోకంలో ఏదీ సులభంగా లభించదు. ప్రపంచం నుంచి మనం దేన్ని పొందాలన్నా ఎంతో కొంత మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రజ్ఞకు తగ్గ సౌశీల్యం, సౌశీల్యానికి తగ్గ సాహసం ఉంటే విధి కూడా మనకు తలవంచుతుంది. అయితే మన కర్మ ఇలా ఉందని నిరంతరం కాలాన్ని నిందించుకుంటూ కూర్చునేవారు జీవితంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు మిగిలిపోతారు. ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష కొరవడిన వారే ‘నా తలరాత’ అని తప్పించుకుంటూ తిరుగుతారు. వచ్చిన అవకాశాల్నీ విధి పేరు చెప్పి వదిలేసుకుంటారు. సామర్థ్యం, స్వప్రయత్నం ప్రతికూలమైన పరిస్థితులను సైతం సానుకూలంగా మార్చేస్తాయని మన సనాతన ధర్మంలో ఎందరో సద్గురువులు ఎన్నో ఉదాహరణలతో ఉద్బోధించారు.
జీవితంలో పురుషప్రయత్నం ప్రాధాన్యం గురించి రామకృష్ణ పరమహంస చక్కని దృష్టాంతాన్ని చెబుతారు. మైదానంలో తాడుతో కట్టేసిన ఆవును ఉదాహరణగా చూపుతూ వివరిస్తారు. మెడకు కట్టిన తాడు ఆ గోవు స్వేచ్చకు ప్రతిబంధకమే! దాని కదలికలకు అది పరిమితిని విధిస్తుంది. తొలుత అంత వరకే తన స్వతంత్రేచ్ఛ(ఫ్రీవిల్) అనుకొని ఆ గంగిగోవు కూడా తనను తాను సమాధాన పరుచుకుంటుంది. అందుకే తన పరిధి మేరకు గడ్డి మేస్తూ కాలం గడిపేస్తుంది. అక్కడ ఇక తనకు గ్రాసం లభించదని రూఢి అయ్యాక దూరంగా ఉన్న గడ్డిపైకి దృష్టి మళ్లిస్తుంది. మెడకు కట్టిన తాడును విదిలించుకొని ఆ పచ్చిక వైపు పరుగులు తీసేందుకు పరిపరివిధాలా ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ మూగజీవి తపనను యజమాని గమనిస్తాడు. అది తాడును వదిలించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు అతడు గుర్తిస్తాడు. ఆ ఆవు ఆరాటాన్ని అర్థం చేసుకొని దాని మెడకు కట్టిన తాడును విప్పేసి మైదానంలోకి వదులుతాడు. ఆ గోవుకు కట్టిన బంధనం లాంటిదే మన తలరాత. తెంచుకోవాలని ప్రయత్నించడమే పురుషార్థం. ఆ యజమానే భగవంతుడు. విధికి దీటుగా మనిషి ఎంత తీవ్రంగా పోరాడితే, అంత త్వరగా ఆ శృంఖలాల నుంచి బయటపడగలడు.
మన వైపు నుంచి ఏ శ్రమా లేకుండా అన్నీ కాలానికే వదిలేస్తున్నామంటే మన స్వప్రయత్నం సడలిపోతున్నట్లు లెక్క. అందుకే ధీరోదాత్తుడు తన జీవన సప్తాశ్వాల రథాన్ని సమర్థుడైన సారథిలా ముందుకు పరుగెత్తిస్తాడు. ప్రతికూలతలు, ప్రతిఘటనల ధూళి రేగినా మార్గం వైపు నుంచి దృష్టి మరలించడు.
తలరాతను చెరిపి తన రాతను రాసుకోవడమే పురుషార్థం. రేపటి మధురక్షణాల కోసం నేటి గరళపు గడియలను సైతం నిబ్బరంగా గడప గలగడమే ధీరత్వం.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో