విజయవాడ, ఆగస్టు 31
రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. వచ్చే ఎన్నికలకు కలసి వెళదామని నిర్ణయించుకున్నాయి. కానీ పొత్తు కుదుర్చుకున్న నెలలోపే రెండు పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తినట్లు కనపడుతుంది. బీజేపీీ వెంట నడిచేందుకు జనసేన అంగీకరించేందుకు ఇష్టపడటం లేదన్నది స్పష్టమవుతుంది. తమ పార్టీ అభిప్రాయాలు తమకున్నాయని చెప్పకనే చెప్పినట్లయింది. ప్రధానంగా రాజధాని అమరావతి విషయంలో బీజేపీ, జనసేనల మధ్య తొలి నుంచి కొంత అయోమయ వాతావరణం నెలకొంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నంత వరకూ రాజధాని అమరావతిపై పోరాటం చేశారు. రాజధాని కోసం ఉద్దండరాయుని పాలెంలో దీక్ష కూడా చేశారు. అప్పుడే జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. ఇద్దరూ కలసి రాజధాని అమరావతి రైతుల కోసం లాంగ్ మార్చ్ చేస్తామని ఢిల్లీలో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ పార్టీ కేంద్ర నాయకత్వం వత్తిడితో అది నిరవధికంగా వాయిదా పడింది.ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు. అమరావతి రాజధాని తరలింపుపై తమ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలని మాత్రం పోరాడతామని చెప్పారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని పదే పదే స్పష‌్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా రాజధాని అమరావతి తరలింపు ప్రక్రియను అడ్డుకునే అవకాశం లేదని స్పష్టమవుతుంది.ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ బీజేపీ స్టాండ్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటామన్నారు. అంతవరకూ బాగానే ఉన్నారు. అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా హైకోర్టులో కౌంటర్ వేయడానికి పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఇది రెండు పార్టీల పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు. బీజేపీ దారిలో వెళితే తమకు ఇబ్బంది ఎదురవుతుందని భావించిన జనసేన అధినేత అమరావతి వైపే నిలబడాలని నిర్ణయించుకున్నారు. మరి పవన్ నిర్ణయంపై బీజేపీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.