విజయవాడ, ఆగస్టు 31
పెను వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఓ చిన్నపాటి కొమ్మదొరికినా.. హమ్మయ్య..! అనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురైంది. ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీని కాపాడుకోవడం ప్రధాన సమస్యగా పరిణమించింది. ఇప్పుడంటే.. కరోనా నేపథ్యంలో ఎవరూ ముందుకు రావడం లేదు కానీ… మరో ఆరేడు మాసాలు గడిస్తే.. అన్ని వ్యాపారాలు, వ్యవహారాలు పుంజుకుంటాయి. అప్పుడు నాయకులు కూడా చైతన్యం అవుతారు. అప్పుడు మరోసారి గోడ దూకుళ్లు తెరమీదికి వచ్చే ఛాన్స్ ఉంది.ఇప్పటికే టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. అధికారికంగా వారు టీడీపీ ఎమ్మెల్యేలే అయినా.. వైఎస్సార్ సీపీకి అనుంగులుగా మారిపోయారు. గత ఏడాది టీడీపీ దక్కించుకున్న ఎమ్మెల్యే సీట్లు 23. వీటిలో ముగ్గురు వెళ్లిపోయారు. మిగిలిన 20 మందిలో మరో ఐదుగురు కూడా పార్టీకి దూరంగానే ఉన్నారు. వీరిలో గంటా శ్రీనివాసరావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన పార్టీకి దూరమైతే.. మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక, పశ్చిమలో ఇద్దరు గెలిచినా.. ఒకరు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు.విశాఖలో ఒక్క తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మినహా గంటాతో సహా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఎంత మాత్రం నమ్మే పరిస్థితి లేదని.. వీరు ఎప్పటి వరకు పార్టీలో ఉంటారో కూడా తెలియదని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఎటొచ్చీ.. ఓ 13 మంది పార్టీలో స్థిరంగా ఉంటారని అనుకున్నా.. వారిని కూడా చంద్రబాబు ఏదైనా తేడా వస్తే.. మందలించే పరిస్థితి లేకుండా పోయింది.తాను, తన వియ్యంకుడు బాలయ్య మినహా మిగిలిన వారిలో పార్టీపై నిబద్ధతతో ఉండే నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, ఏలూరి సాంబశివరావు, చినరాజప్ప, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణ, వేగుళ్ల జోగేశ్వరరావు వంటి వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే నాయకులు చంద్రబాబుకు అండగా ఉండే పరిస్థితి ఉంది.వీరు కాకుండా సీనియర్లు కొందరు పార్టీని అంటిపెట్టుకుంటారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి ? పార్టీ ఈ పదిమందితోనే పరుగు పెడుతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో యువతకు పదవులు ఇవ్వాలని.. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం చేస్తారో ? చూడాలి.