విజయవాడ, ఆగస్టు 31,
ఎంతకాదనుకున్నా ఏపీ రాజకీయల్లో కులం ఫ్యాక్టర్ ని ఎవరూ కొట్టిపారేయలేరు. కులం ఏంటి అని చూసే జనం కూడా ఓటేస్తున్నారు. ఇది నాయకులు మప్పారా. జనానికే ఈ మూఢత్వం ఉందా అంటే అది వేరే చర్చ. కానీ కులం పట్టుకునే రాజకీయం మొత్తం ఏపీలో సాగుతుంది అన్నది వాస్తవం. ఇక పాతతరం రాజకీయ నాయకులు ఈ కులాల కుంపట్లు రగిలించారు అనుకున్నా కూడా కొత్త తరం నాయకులుగా వస్తున్న వారు కూడా దాన్నే అనుసరించడంతో కులం రొచ్చు ఏపీని ఇప్పట్లో వదిలేలాలేదు. ఇక ఫలానా కులం వాణ్ణి తిట్టించాలంటే చంద్రబాబు తన పార్టీలోని అదే కులం వారిని అస్త్రంగా ప్రయోగించేవారు. ఇపుడు జగన్ కూడా అదే అనుసరిస్తున్నారు.ఇక ఏపీలో ఎన్ని చెప్పుకున్నా జగన్ సర్కార్ కమ్మలకు వ్యతిరేకం అనే ముద్ర పడిపోయింది. దానికి అలా కలరింగ్ ఇచ్చిన ఘనత టీడీపీదే అని చెప్పాలి. ఆ పార్టీకి ఎటూ మీడియా సపోర్టు కూడా ఉంది. దాంతో జగన్ కి కమ్మలు ఇష్టం లేదు అని ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఈ మధ్యన ఒక సినీ నటుడు అదే సామాజిక వర్గానికి చెందిన వాడు కులం వైరస్ ఏపీలో ఎక్కువ అని కామెంట్స్ చేశాడు. మరి అయిదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏ వైరస్ ఉందో సదరు హీరోకు తెలియదనుకోవాలా. లేక ఇపుడు అతి తెలివి చూపిస్తున్నాడు అనాలో తెలియదు కానీ కులం వైరస్ ఉందని దాన్ని పెంచి పోషించిన సామాజిక వర్గాలే పదే పదే అంటూ నిందను జగన్ మీదకు నెడుతున్నాయిజగన్ వైసీపీ సర్కార్ వచ్చాక తన కులం వారికి నాలుగే మంత్రి పదవులు ఇచ్చారు. కమ్మల నుంచి ఒక్కరికే అవకాశం దక్కింది. అలా కొడాలి నాని మంత్రి అయ్యారు. ఆయన కమ్మ సామాజికవర్గం ప్రతినిధిగా సొంత వారే అంగీకరించడంలేదని అంటున్నారు. నిజానికి నాని ఎన్టీయార్ కి వీర భక్తుడు. ఆయనకు తెలుగుదేశం ఒకపుడు ప్రాణం. చంద్రబాబు జమానాలో ఎన్టీయార్ తీపి గురుతులు చెరిగిపోవడం నందమూరి రక్తానికి విలువ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలోకి వచ్చారు. కొడాలి నాని జగన్ కి వీర విధేయుడుగా ఉంటున్నారు. ఇక వైసీపీలో అనేక మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొడాలి నాని ద్వారా కమ్మ వారిని ఆకట్టుకోవడానికి జగన్ వేస్తున్న ఎత్తులు అంతగా ఫలించడంలేదు. దానికి కొడాలి నానిని తమకు వైరి వర్గంగా కమ్మలు భావించడమేనని అంటారుఇక అమరావతి రాజధాని విషయంలో ఎంత కాదనుకున్నా కమ్మల కలలను జగన్ చెదరగొట్టాడనే ఆగ్రహం వారిలో ఉంది. ముఖ్యంగా రెండు జిల్లాల్లోని సగటు కమ్మ ప్రజానీకం ఈ రకమైన అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. దానికి విరుగుడుగా జగన్ ఏం చేయాలన్న దానిమీద ఆలోచిస్తున్నారుట. కమ్మలకు మరింతమందికి రాజకీయంగా న్యాయం చేయడం ద్వారా మాత్రమే కొంతలో కొంత వ్యతిరేకత పోగొట్టుకోవచ్చునని జగన్ వ్యూహం. ఇక టీడీపీ నుంచి సస్పెండ్ అయి జగన్ కి మద్దతు ఇస్తున్న వల్లభనేని వంశీ చంద్రబాబుకు కమ్మ కులానికి ద్రోహం చేసిన వ్యక్తిగా ఆరోపిస్తున్నారు. తన రాజకీయం కోసం కమ్మలను బాబు భ్రష్టు పట్టించాడని వంశీ ఘాటుగానే ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధంగా కమ్మలు వేరు, టీడీపీ వేరు అన్న భావన కలిగించడం ద్వారా వారిని వేరు చేసి తమ వైపునకు తిప్పుకోవాలని జగన్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ లో మరికొంతమంది కమ్మలకు పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.