గుంటూరు, ఆగస్టు 31
అమరావతి రాజధాని ముడి ఇపుడు ఉరితాడు అయి విపక్ష పార్టీలను చుట్టబెట్టేస్తోంది. ఇంతకాలం మీడియా ముందు ఏం చెప్పి తప్పించుకున్నా ఇపుడు హైకోర్టుకు తమ విధానం తెలియచేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. హైకోర్టు తాజాగా అన్ని రాజకీయ పార్టీలకు అమరావతి రాజధాని మీద వాటి విధానం తెలియచేయాలని నోటీసులు జారీ చేసింది. వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు ఇలా అన్ని పార్టీలకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం అసాధారణ పరిణామంగా న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. అమరావతి రాజధాని విషయంలో నాడు ఒక మాట, నేడు ఒక మాట రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయని రాజధాని పరిరక్షణ సమితి చేసిన ఫిర్యాదు, వేసిన పిటిషన్ మేరకు హైకోర్టు ఈ కేలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.ఈ పరిణామం వైసీపీకి తప్ప మిగిలిన పార్టీలకు ఇక్కట్లు తెచ్చిపెట్టేదేనని అంటున్నారు. తాము అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని ఈ పార్టీలు అఫిడవిట్ ఇస్తే ఇక అధికారిక విధానం అవుతుంది. దాని నుంచి వారు ఎక్కడా తప్పించుకోలేరు. అలా కాకుండా వేరే విధంగా చెప్పి తప్పించుకుందామని చూస్తే తాము ఇంతవరకూ జై అమరావతి అన్న మాటకు అర్ధం లేకుండా పోతుంది. బీజేపీ వరకూ తీసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ వరకూ జై అమరావతి అంటే సోము వీర్రాజు వచ్చాక రాజధాని అన్నది రాష్త్రానిది ఇష్టమని తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంటే బీజేపీకి ఒక విధానం ఉందా అన్న చర్చ వస్తోంది. దానికి జవాబు ఇపుడు అఫిడవిట్ రూపంలో దొరకొచ్చేమో.ఇక జనసేన విషయం తీసుకుంటే ఎన్నో సార్లు జై అమరావతి అని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తాం, అమరావతిని కాపాడుతాం అని కూడా అయన చెప్పుకొచ్చారు. సోము వీర్రాజు ప్రెసిడెంట్ కాగానే జనసేన వాయిస్ కూడా మారింది. అంతకు ముందు పొత్తు పెట్టుకున్న నాటికే పవన్ బాగా తగ్గారని విమర్శలు ఉన్నాయి. ఇపుడు పవన్ జనసేన అధ్యక్షుడిగా తన పార్టీ విధానం ఇదీ అని కచ్చితంగా చెప్పాల్సివుటుంది. అలా కనుక అమరావతికి ఆయన ఓటేస్తే మిగిలిన ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తుంది. మూడు రాజధానులకు మద్దతు ఇచ్చి వైసీపీ బాటన నడవడం కూడా సాహసమే. చూడాలి ఆయన ఎలా స్పందిస్తారో. వామపక్షాలు, కాంగ్రెస్ ఏ విధంగా అఫిడవిట్ ఇచ్చినా పెద్దగా రాజకీయ ఇబ్బంది లేదు. ఇక టీడీపీ ఎటూ అమరావతికి కట్టుబడి ఉంది. ఆ పార్టీ తన రాజకీయాన్ని సైతం పందెం ఒడ్డి మరీ అంతా అమరావతితోనే తేల్చుకోవాలని చూస్తోంది. కాబట్టి మిగిలిన పార్టీలు కూడా జై అమరావతి అంటే కలసివస్తుందని భావిస్తోంది.ఇక వైసీపీయే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. కాబట్టి తాము అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అఫిడవిట్ జగన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికల ముందు ఏం చెప్పారు. అసెంబ్లీలో ఎలా నాడు సమర్ధించారు అన్న దాని మీద వైసీపీకి ఒక క్లారిటీ ఉంది. తాము ప్రభుత్వ స్థలం 30 వేల ఎకరాలు తీసుకోమన్నాం కానీ నయా జమీందార్లను తయారు చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాజధాని అమరావతిని వాడుకోమని చెప్పలేదని ఇప్పటికే మంత్రి కొడాలి నాని తమ విధానం చెప్పారు. అదే విధంగా మిగిలిన పార్టీలు అన్నీ కూడా జై అమరావతి అంటే అది వైసీపీకి రాజకీయంగా లాభమే. రాయలసీమ, ఉత్తరాంధ్రాలో బలపడవచ్చు. ఒకవేళ ఆయా పార్టీలు కూడా మద్దతు ఇస్తే మరీ మంచిదన్నది వైసీపీ ఆలోచన. ఏది జరిగినా తమకు లాభమేనని వైసీపీ ఆలోచిస్తొందిట. మొత్తానికి అన్ని పార్టీలు అమరావతి రాజధాని విషయంలో కోర్టుకు అఫిడవిట్లు ఇవ్వడం కాదు కానీ అవి వాటి రాజకీయ భవిష్యత్తునే తేల్చబోతున్నాయని అంటున్నారు