విశాఖపట్టణం, ఆగస్టు 31
మొత్తానికి టీడీపీ సీనియర్ నేత, బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరిపోయారు. రెండు దశాబ్దాల క్రితమే కృష్ణా జిల్లా నుంచి విశాఖకు పారిశ్రామికవేత్తగా వచ్చిన రమేష్ బాబుకు వివాదరహితునిగా పేరుంది. రాజకీయ వ్యూహాలు పెద్దగా తెలియకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే నాయకుడు అని పేరు. అవినీతి మరకలు లేవు. ప్రజల కోసం పనిచేస్తారు. పైగా ఆయనకు గంటా మాదిరిగానే పలు నియోజకవర్గాల్లో అనుచరులు ఉన్నారు. ఆయన తొలిసారిగా ప్రజారాజ్యం తరఫున పెందుర్తి నుంచి గెలిచారు. దాంతో అక్కడ ఆయనకు గట్టిగా మద్దతుదారులు ఉన్నారు. అలాగే ఎలమంచిలి నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున రెండవ సారి గెలిచారు. అక్కడ కూడా ఆయనకు పట్టుంది. ఇక ఆయన ఉండేది విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో. దాంతో ఆ ప్రాంతంలో కూడా మంచి బలగం ఉంది. ఇవన్నీ చూసే వైసీపీ ఆయన్ని కోరి మరీ పార్టీలో చేర్చుకుంది.పంచకర్ల రమేష్ బాబు మనసు ఎపుడూ విశాఖ ఉత్తరం సీటు మీదనే ఉంది. నిజానికి ఆయన వైసీపీలోకి 2019 ఎన్నికల ముందే చేరాలి. ఆయన కోరిన సీటు వైసీపీ ఇవ్వలేకపోయింది అని అంటారు. విశాఖ ఉత్తరం నుంచి తనకు సీటు ఇస్తే గెలుచుకుని వస్తాను అని పంచకర్ల రమేష్ బాబు చెప్పారు. కానీ అది జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేకే రాజుకు కేటాయించేశారు. అలాగే ఎలమంచిలి సీటు కూడా కన్నబాబురాజుకు ఇచ్చేశారు. దాంతో ముందు పార్టీలో చేరితే తరువాత ఏదో ఒక పదవి చూద్దామని చెప్పారు. అపుడు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ నుంచి ఆయన ఎలమంచిలిలో పోటీ చేసి ఓడిపొయారు. ఇపుడు ఆయన వైసీపీలో చేరడంతో ఇద్దరు రాజులకు గుండె దడ పట్టుకుందిట.ఇదిలా ఉంటే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరిన కార్యక్రమానికి విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరు కావడం కూడా చర్చనీయాంశంగా ఉంది. ఈ ఇద్దరూ ఒకేసారి ప్రజారాజ్యం తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. పైగా ఇద్దరూ మంచి మిత్రులు కూడా అయితే. వైసీపీలోకి అవంతి ఫిరాయించాక పంచకర్లతో ఎడం పెరిగింది అంటారు. తాను ఆనాడు పంచకర్లను తీసుకురావడానికి చూస్తే ఆయన రాలేదన్న బాధ కూడా అవంతికి ఉందిట. ఇపుడు అధికార పార్టీలో పంచకర్ల రమేష్ బాబు చేరడం వెనక విజయసాయిరెడ్డి ఉన్నారని అంటున్నారు. దీని వెనక వ్యూహం ఏదేమైనా కూడా పంచకర్ల వైసీపీలోకి రావడం పట్ల మంత్రి అంత ఇష్టంగా లేరా అన్న చర్చ కూడా మొన్నటి వరకూ సాగింది. అయితే అవంతి హాజరు కావడంతో ఆ అనుమానాలు తొలగిపోయాయి.వైసీపీ లెక్కలు వేరుగా ఉన్నాయి. విశాఖ సిటీలో వైసీపీ బలహీనంగా ఉంది. నాలుగు సీట్లూ టీడీపీయే గెలుచుకుంది. దాంతో గట్టి నాయకులు కావాలని గేలం వేస్తున్నారు. ఇపుడు విశాఖ ఉత్తరం నుంచి పట్టున్న నేతగా పంచకర్ల రమేష్ బాబు చేరిక ఎటూ వైసీపీకి ఉపయోగపడేదే. ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి పార్టీని మరింతగా బలంగా సిటీలో చేసుకోవడానికి వాడుకుంటారని అంటున్నారు. విశాఖ రాజధానికి మద్దతు ఇచ్చే వాయిస్ గా కూడా ఉంటారన్నది మరో ఎత్తుగడ. యువ పారిశ్రామికవేత్తగా, కాపు నేతగా ఉన్న పంచకర్ల రమేష్ బాబును ఫోకస్ చేస్తే పార్టీకి ప్లస్ అవౌతుందని కూడా వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. 2024 నాటికి ఆయనకు విశాఖ ఉత్తరం సీటు దక్కినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. మొత్తానికి పంచకర్ల రాకతో టీడీపీకి గట్టి దెబ్బ పడిపోగా వైసీపీలో కూడా పలువురు నేతలు అభద్రతాభావానికి గురి అవుతున్నారు అన్నది నిజం.