హైద్రాబాద్, ఆగస్టు 31
డాలర్ బాయ్... ప్రస్తుతం మీడియా, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న పేరు ఇది. ఇతడి అసలు పేరు రాజశేఖర్‌గా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కేసులు ఉన్న ఇతగాడు తాజాగా కొందరిని బెదిరించడంతో పొరుగు జిల్లాల్లో కేసులు నమోదైనట్లు సమాచారం. తాజాగా సీసీఎస్‌కు బదిలీ అయిన అత్యాచారం కేసులో ఇతడి ప్రమేయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. యువతుల్ని ట్రాప్ చేసి ప్రేమ, పెళ్ళి పేరుతో దగ్గర కావడం, ఆపై బ్లాక్‌మెయిల్ చెయ్యడం ఇతడి హాబీగా తెలుస్తోంది. 2018లో ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన యువతిని ట్రాప్ చేశాడు. ఆమె ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు తన వద్ద ఉంచుకుని బెదిరించాడని తెలిసింది. ఇలా ఆమెను లొంగదీసుకుని వివాహం చేసుకున్నాడని, ఆపై కొన్ని రోజులకు మోసం చేశాడని సమాచారం.అనంతపురానికి మరో యువతిని ప్రేమ వివాహం చేసుకుని మోసం చేశాడు. ఇతగాడి మాయమాటల్ని నమ్మిన ఆ యువతి 2018 డిసెంబర్‌లో వివాహమాడిందని తెలిసింది. వివాహం జరిగిన కొన్ని రోజులకు ఈ డాలర్ బాయ్ నిజస్వరూపం తెలిసిన ఆమె షాక్‌కు గురైంది. నిలదీసిన ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ సైకోలా ప్రవర్తించాడని తెలిసింది. డబ్బు, బంగారం తీసుకుని రావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. తనని విడిచి వెళితే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వనని బెదిరించాడని సమాచారం.ఎట్టకేలకు ఇతడి చెర నుంచి బయటపడిన ఆ యువతి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఆపై డాలర్ బాయ్ కన్సల్టెన్సీ, యాడ్ ఏజెన్సీల పేరుతో పలువురిని ఆకర్షించి ఉద్యోగాల ఆశ చూపాడు. ఆసక్తి చూపిన వారి సర్టిఫికెట్లను తన వద్ద పెట్టుకొని బ్లాక్ మెయిల్‌కు దిగాడని పోలీసులు అనుమాని స్తున్నారు. ‘పంజగుట్ట అత్యాచారం’ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఇతగాడు ఫోన్లు చేసి బెదిరించాడు. వీరిలో కొందరి నుంచి డబ్బు కూడా డిమాండ్ చేశాడు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ఓ కేసు నమోదు కాగా.. ఆ ఆడియోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో బాధితురాలితో, ఈ కేసుతో ఇతడికి ఉన్న లింకులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ డాలర్ బాయ్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.