వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో మండపాల్లో కొలువుదీరే గణపయ్యల సందడి అంతా ఇంతా కాదు. వైవిధ్య రూపాల్లో గణనాథుడి విగ్రహాలను కొలువుదీర్చి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అందుకుతగ్గట్టే మండపాలనూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు. లింగం ఎత్తుకున్న గణపతి, బాహుబలి గణేష్, కాయిన్స్ గణపతి ఇలా వైవిధ్య రూపాల్లో గణనాథుణ్ని కొలుస్తారు. అయితే.. వినాయక చవితి సందర్భంగా రూపొందించే గణనాథులే కాదు.. దేశంలోని అనేక గణేష్ ఆలయాల్లోనూ వైవిధ్య విగ్రహాలు ఉన్నాయి. అలాంటి ఓ అరుదైన గణపతి తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో కొలువుదీరి ఉన్నాడు.
అవంచలో కొలువుదీరిన గణపతి దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం కావడం విశేషం. భక్తులు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు. దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. ఈ అరుదైన గణపతిని చూడటానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తారు.
ఈ అరుదైన ఏకశిలా విగ్రహం పదకొండో శతాబ్దం నాటికి చెందిందని చరిత్ర చెబుతోంది. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. అవంచ గ్రామంలో ఉన్న ఏకశిలను అందమైన వినాయకుడి విగ్రహంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిల్పిని నియమించినట్లు చరిత్రలో ఉంది. అయితే.. ఆ పని జరుగుతుండగానే తైలంపుడు అనారోగ్యం బారిన పడి అకస్మాత్తుగా మృత్యువాతపడ్డాడు. గణపయ్య శాపంతోనే ఇలా జరింగిందని స్థానికంగా ప్రచారంలో ఉంది.
ఏదేమైనా.. ఇంతటి అరుదైన చారిత్రక సంపద, ఏకశిలా గణపతి సంరక్షణకు నోచుకోవడంలేదని అవంచ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ విగ్రహం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆరుబయటే ఉందనీ, ఇన్నేళ్లైనా.. పైకప్పు కూడా ఏర్పాటు చేయలేకపోవడం దారుణం అని వాపోతున్నారు.
భద్రాద్రి, యాదాద్రి ఆలయాలకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అవంచ గణపతి విగ్రహాన్ని కూడా పట్టించుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. అవంచ గణపయ్యను సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి లక్ష్మారెడ్డి ఇదివరకే దర్శించారని, వారికి విగ్రహం గొప్పదనం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదని వారంటున్నారు.