న్యూఢిల్లీ, ఆగస్టు 31
తూర్పు లడఖ్‌లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో రష్యాలో జరిగే బహుళ దేశాల సైనిక విన్యాసాల నుంచి వైదొలగాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి, ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ విన్యాసాల్లో చైనా, పాకిస్థాన్‌లు కూడా పాల్గొనడం వల్లే వైదొలిగినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా, పాకిస్థాన్‌లకు విస్పష్ట సంకేతాలను పంపేందుకు ఈ చర్యను చేపట్టినట్లు వివరించాయి‘కావ్‌కాజ్- 20’ పేరుతో సెప్టెంబర్ 15 నుంచి 26 వరకూ రష్యా దక్షిణ ప్రాంతం అస్ట్రాఖాన్‌లో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఇందులో చైనా, పాకిస్థాన్ సహా 20 దేశాలు పాల్గొనాల్సి ఉంది. ఈ విన్యాసాలలో తామూ భాగస్వాములవుతామని గత వారమే రష్యాకు భారత్ తెలియజేసింది. అయితే సైనిక, విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.‘భారత్, రష్యాలు సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు. రష్యా ఆహ్వానం మేరకు భారత్ అనేక అంతర్జాతీయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తోంది. అయితే కరోనా మహమ్మారి, అవసరమైన ఏర్పాట్లు సహా విన్యాసాలకు సంబంధించిన ఇతర ఇబ్బందుల వల్ల కావ్‌కాజ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాం’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఎ.భరత్ భూషణ్ బాబు తెలిపారు.ఇది బహుళ దేశాల సైనిక డ్రిల్ అయినా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులు కూడా హాజరయ్యే విన్యాసాలలో మన సైన్యం పాల్గొనడం అర్ధవంతం కాదని నిర్ణయించినట్టు ఓ సీనియర్ అధికారి అన్నారు. వాస్తవాధీన రేఖను దాటి భారత్ భూభాగంలోకి చైనా సైన్యం చొరబడటమే కాకుండా.. ముందస్తు వ్యూహంతోనే గాల్వాన్ లోయ వద్ద జూన్ 15న మన జవాన్లపై అత్యంత దారుణమైన దాడికి పాల్పడ్డారు.. ఇది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సాధారణ కార్యకలాపాలు కాదు’ అని అన్నారు.ఆర్మీ నుంచి 150 మందిని, ఎయిర్‌ఫోర్స్ నుంచి 45 మందిని, నౌకా దళానికి చెందిన పలువురు అధికారులను ఈ విన్యాసాలకు పంపాలని భారత్ తొలుత భావించింది. ఈ విన్యాసాల్లో ఉగ్రవాద దాడిని తిప్పికొట్టడం వంటి ఆపరేషన్లు సైనికులు నిర్వహించనున్నారు. భారత్, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తల నివారణకు మధ్యవర్తిత్వానికి రష్యా ప్రయత్నిస్తున్న వేళ ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.వచ్చే నెలలో రష్యాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, వ్యూహాత్మక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.కావ్‌కాజ్-20లో షాంఘై సహకార సంస్థలోని సభ్య దేశాలు సహా మధ్య ఆసియాలోని 20 దేశాలు పాల్గొంటాయి. కనీసం 19 దేశాలకు చెందిన మొత్తం 13వేల మంది సైనికులు ఈ విన్యాసాలకు హాజరవుతారు. 2001లో రష్యా, చైనా, కజికిస్థాన్‌తో ఏర్పాటైన ఎస్‌సీఓలో భారత్, పాకిస్థాన్‌లు 2017లో పూర్తిస్థాయి సభ్య దేశాలుగా చేరాయి.