విజయవాడ, ఆగస్టు 31
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. గతంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు. దానితో జగన్ సర్కారుకు కోపం వచ్చి, ఆయనను ఆ పదవి నుంచి తొలగించేసింది. సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, కోర్టుకెళ్లిన నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావటంతో, మళ్లీ ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.అయితే నిమ్మగడ్డ కమిషనర్‌గా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో.. అధికార వైసీపీ పోలీసులతో భయపెట్టి, విపక్షాలకు చెందిన అభ్యర్ధులను పోటీ నుంచి ఉపమసంహరించుకోవడంతో అనేక చోట్ల ఏకగ్రీవమయ్యాయి. దానిపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు, వాటిని రద్దు చేసి తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. అయినా నిమ్మగడ్డ వారి డిమాండ్‌ను ఖాతరు చేయకుండా, ఏకగ్రీవాలను ధృవీకరించారు. నిమ్మగడ్డ రమేష్ ఆ విషయంలో విపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం చేతిలో ఎన్నికల కమిషన్ కీలుబొమ్మగా మారిందని విరుచుకుపడ్డారు.ప్రధానంగా.. అప్పటి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మిగిలిన రాష్ట్ర నాయకులు, ఏకగ్రీవాలను రద్దు చేసి, తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గవర్నర్,ఎస్‌ఈసీకి లేఖ రాశారు. 2365 చోట్ల ఎంపీటీసీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అందులో కొన్ని మినహా మిగిలినవన్నీ, అధికార వైసీపీ హస్తగతమయ్యాయి. బరిలో నిలిచిన ప్రతిపక్ష అభ్యర్ధులను పోలీసు ద్వారా బెదిరించడం, వారికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వంటి అరాచకాలతో, వైసీపీ అన్నీ ఏకగ్రీవాలు చేసుకుందని విపక్షాలు ధ్వజమెత్తాయి. అయినా నిమ్మగడ్డ దానిని పట్టించుకోలేదు. ప్రధానంగా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంత మండలానికి చెందిన, ఓ అభ్యర్ధి చేయి నరికిన వైనం సంచలనం సృష్టించింది. బీజేపీ అభ్యర్ధులపైనా అనేక చోట్ల దాడులు జరిగి, ఏకగ్రీవం చేసుకున్న వైనంపై కమలదళం కన్నెర్ర చేసింది. దీనికి బాధ్యులయిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దానికి స్పందించిన నిమ్మగడ్డ రమేష్.. ఐఏఎస్, ఐపిఎస్, డీఎస్పీలను కూడా విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.నిమ్మగడ్డ తిరిగి విధుల్లోకి వచ్చిన నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల నిర్విస్తారా? లేదా? అన్న ప్రశ్నతోపాటు.. ఏకగ్రీవమైన చోట్ల ఎన్నికలు రద్దు చేస్తారా? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. పార్లమెంటును జిల్లాగా ప్రకటిచేందుకు జగన్ సర్కారు సిద్ధమవుతోంది. దానికోసం ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది. ఆ ప్రకారం 25 లేదా 26 జిల్లాలు ఏర్పాటవుతాయన్న చర్చ జరుగుతోంది. అంటే అంతమంది జడ్పీ చైర్మన్లు ఎన్నిక కావలసి ఉంది. ఆ ప్రకారంగా తిరిగి రాష్ట్రవ్యాప్తంగా, కింది నుంచి పై స్ధాయి వరకూ రిజర్వేషన్లు ఖరారు చేయవలసి ఉంటుంది. అప్పుడు ప్రస్తుతం ఏకగ్రీవమైన స్థానాలు ఒకవేళ రిజర్వేషన్లు కేటాయిస్తే, మళ్లీ అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి.. ప్రభుత్వమే జిల్లాల కోసం కమిటీ ఏర్పాటుచేసినందున, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకగ్రీవమైన స్థానాల్లో జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.అదేవిధంగా, నాడు నిమ్మగడ్డ ఆదేశాల ప్రకారం.. ఎస్పీ,కలెక్టర్లు, డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేయలేదు. నిమ్మగడ్డ తిరిగి, ఎస్‌ఈసీగా నియమితులయినందున… తన ఆదేశాలు అమలుచేయాలని, తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తారా? లేదా అన్న ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. కోర్టు- గవర్నర్ ఆదేశాలతో నిమ్మగడ్డ తిరిగి కమిషనర్‌గా నియమితులయినందున.. నిమ్మగడ్డ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాల్సిందేనని న్యాయనిపుణులు చెబుతున్నారు.గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని, బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా? లేదా? అన్న చర్చ తెరపైకొచ్చింది. గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కమిటీ నేతలు.. ఏకగ్రీవాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు లేఖ రాశారు. మరి ఇప్పుడు అధ్యక్షుడు మారినందున.. ఆయన కూడా ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తారా? లేక అప్పటి విధానాలు వేరు-ఇప్పటి విధానాలు వేరంటారా? అలాకాకుండా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఎందుకునే అన్న మొహమాటంతో మౌనంగా ఉంటారా? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.ఇప్పటికే సోము వీర్రాజు వైసీపీ సర్కారు పట్ల సానుభూతి, టీడీపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని, అందుకే చానెళ్ల చర్చలకు పార్టీ ప్రతినిధులను కూడా పంపించడం లేదన్న వాదన పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ నుంచి పంపించే ప్రకటనలు కూడా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదన్న ఆదేశాలు వచ్చాయని, మరో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తనపై జరుగుతున్న ఈ ప్రచారానికి తెరదించేందుకు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల అంశం అగ్నిపరీక్షగా మారింది. దానిపైనే సోము సత్తా ఏమిటి? సర్కారుపై ఆయన వైఖరేమిటన్నది తేలిపోతుందని బీజేపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవల దళిత పారిశ్రామిక విధానంపై సోము రాసిన లేఖ పార్టీ నేతలను విస్మయపరిచింది. లేఖ రాసిన తీరు పరిశీలిస్తే, లేఖతో తాము ప్రభుత్వాన్ని కనీసం తమలపాకుతో కూడా కొట్టినట్లు కూడా లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.