YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కరోనా కాలంలో ఆర్టీసీకి కొరియర్ ఆదాయం

కరోనా కాలంలో ఆర్టీసీకి  కొరియర్  ఆదాయం

విజయవాడ, సెప్టెంబర్1, 
ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపబడుతున్న పార్శిల్‌-కొరియర్స్‌ సర్వీసుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించి, మరింత వ్యాపారాభివృద్ధి సాధించే దిశగా సంబంధిత యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. వ్యాపార రంగంలో ఎదురవుతున్న పోటీకనుగుణంగా కస్టమర్‌కు మెరుగైన సేవలు అందించి, తద్వారా మరింత రాబడిని సాధించే దిశగా ఆర్టీసీ యాజమాన్యం కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంది. పార్శిల్‌- కొరియర్స్‌ రంగంలో ఇప్పటికే వచ్చిన అనుభవాల దృష్ట్యా కష్టమర్‌ ఇబ్బంది పడకుండా, పార్సిల్స్‌ ద్వారా వచ్చిన సరుకును త్వరగా గుర్తించి, డిస్పాచ్‌ చేసేందుకు వీలుగా, సురక్షితంగా ఉంచడానికి ఆధునిక టెక్నాలజీని వినియోగించి, విశాలమైన వాతావరణంలో ఉండేందుకు పార్శిల్‌-కొరియర్స్‌ కోసం ప్రత్యేక డెలివరీ కౌంటర్‌ సిద్ధం చేస్తున్నారు.పార్శిల్‌-కొరియర్‌ ద్వారా ప్రస్తుతం రోజుకు రూ.20 లక్షలు వస్తుంటే... నెలకు రూ.ఆరు కోట్ల వరకు రాబడి వస్తోంది. రోజుకు 15 వేల మంది కస్టమర్స్‌ వరకు నమోదు అవుతున్నట్లు ఆయన చెప్పారు. ఎల్‌ఆర్‌ నెంబర్‌ కంప్యూటర్‌లో కొట్టిన వెంటనే ఆ సరుకు పెట్టిన లొకేషన్‌ తెలుసుకొని, వెంటనే సరుకును డిస్పాచ్‌ చేయకలిగే సదుపాయం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న డెలివరీ పాయింట్‌లో కంప్యూటర్‌ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిని ఉన్నతాధికారులు 10-15 రోజుల్లోపే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఎరైవల్‌ పాయింట్‌లో ప్రస్తుతం ఉన్న బుకింగ్‌ పాయింట్‌ను అక్కడే ఉంచి, నూతనంగా ఏర్పాటు చేస్తున్న డెలివరీ పాయింట్‌లో సరుకును భద్రపరచడానికి 59 ర్యాక్స్‌ను ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు. పికప్‌ డెలివరీతో పాటు సరుకుకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించే రీతిలో గతంలో స్కీమ్‌ను ఏర్పాటు చేసినా అది విజయవంతం కాలేదని, కొంత మార్పు చేసి మరలా అదే స్కీమ్‌ను ప్రవేశపెట్టబోతున్నామని అధికారులు చెప్తున్నారు.బస్‌స్టేషన్‌లోని ఎరైవల్‌ బ్లాక్‌లోని సినిమా హాలు వెనుకాల విశాలమైన డెలివరీ కౌంటర్‌ను ఏర్పాటు దాదాపు పూర్తి కావచ్చింది. పార్శిల్‌-కొరియర్స్‌ బుకింగ్‌ కౌంటర్‌తో పాటు డెలివరీ పాయింట్‌ రెండూ కూడా ఎరైవల్‌ బ్లాక్‌ ఒకే చోట ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే ఇలా నిర్వహిస్తుండటంతో కొన్ని చిక్కులతో పాటు సంబంధిత కస్టమర్‌కు సరుకు అందించడంలో కానీ, ఆ సరుకును సురక్షితంగా ఉంచడంలో గానీ కొన్ని ఇబ్బందులు తప్పడం లేదని ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కస్టమర్‌ వచ్చి తనకు సంబంధించిన సరుకును అడిగి డెలివరీ చేయాలంటే అన్ని రకాల సరుకులు ఒకే చోట గుట్టలు గుట్టలుగా ఉండటం, వాటిని గుర్తించి, డెలివరీ చేయాలన్నా గంటల తరబడి సమయం తీసుకుంటూ, అటు నిర్వాహకులు, ఇటు కస్టమర్‌ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరికొన్ని సందర్భాల్లో ఒక చోటు నుంచి మరొక చోటుకు పార్శిల్స్‌ ద్వారా సరుకును పంపించే క్రమంలో అడ్రస్‌ తప్పు పడటమో... లేక లోడ్‌-అన్‌లోడ్‌ చేసే సమయంలో పగిలిపోతుండటం వంటివి చోటు చేసుకుంటూ సంబంధిత కస్టమర్‌ నష్టం చవిచూడాల్సి వస్తోంది. అంతేగాక మరికొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు అప్రమత్తంగా లేనట్లయితే మిస్‌ యూజ్‌ అవుతున్న సందర్భాలు కూడా లేకపోలేదని పలువురు దిగువ స్థాయి సిబ్బంది వివరిస్తున్నారు.మిగిలిన ప్రయివేటు కొరియర్స్‌ కానీ ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో కానీ సరుకును పంపించడానికి ఆలస్యంతో పాటు ఖర్చు కూడా తడిచి మోపడవుతుండటంతో ఆర్టీసీ పార్శిల్‌-కొరియర్స్‌పై అత్యధిక మంది కస్టమర్స్‌ మక్కువ చూపుతున్నారు. సమయం పొదుపుతో పాటు ఖర్చు కూడా సగానికి సగం తగ్గిపోయి ఆదా అవుతున్న క్రమంలో ఎక్కువ మంది ఇటు వైపే మొగ్గుతున్నారు. దీంతో ఆర్టీసీ పార్శిల్‌-కొరియర్స్‌ వ్యాపారం రోజు రోజుకూ పెరుగుతోందని సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. పార్శిల్‌-కొరియర్‌ నిర్వహణ మొత్తాన్ని హైదరాబాద్‌కు చెందిన గెలాక్సీ సంస్థ చూస్తుండగా, పర్యవేక్షణ మాత్రం ఆర్టీసీ యాజమాన్యం చూస్తోంది. వ్యాపారం ద్వారా వచ్చే రాబడిలో 4.9 శాతం గెలాక్సీ సంస్థకు, మిగిలిన రాబడి ఆర్టీసీ సంస్థకు చెందేలా ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే నిర్వహణ జరుగుతుంది. పార్శిల్‌- కొరియర్‌ వ్యాపారం జరుగుతున్న రాష్ట్రంలోని ఆయా డిపోల పరిధిలో నిర్వహణ మొత్తాన్ని గెలాక్సీ సంస్థే చూస్తుంది. ఈ గెలాక్సీ సంస్థ విజయవాడ బస్‌స్టేషన్‌లో సుమారు 40 మంది వరకు వివిధ స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా, ఆర్టీసీకి చెందిన పది మంది కండెక్టర్‌ స్థాయి సిబ్బంది, ఇద్దరు ఎడిసిలు, ఒక ఎటిఎం కార్గో వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాలకు ఆర్టీసీ సర్వీసుల ద్వారానే సరుకు పార్శిల్‌-డెలివరీ జరుగుతుంది. సుదూరు ప్రాంతాలకు ప్రయివేటు పార్శిల్‌-కొరియర్‌ సంస్థల ద్వారా కనీసం రెండు, మూడు రోజులు సమయం పట్టడంతో పాటు అధిక ఖర్చు అవుతుంటుంది. అదే ఆర్టీసీ ద్వారా అయితే ఎపితో పాటు పైన పేర్కొన్న ప్రధాన నగరాలకు సైతం కేవలం ఒక రోజు లోపే గాక తక్కువ ఖర్చుతో సరుకును కస్టమర్‌కు అందించే సౌలభ్యం ఉంటుందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు కోరుతున్నారు.

Related Posts