విజయవాడ, సెప్టెంబర్ 1,
ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు రావడం లేదు. కరోనా కారణంగా కేవలం సమీక్షలకే పరిమితమయ్యారు. జిల్లాల పర్యటనలు కూడా చేయడం లేదు. అయితే ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఇళ్ల పట్టాలు, ఇసుక తవ్వకాలపై వైసీపీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పేదలకు కేటాయించాల్సిన ఇళ్ల స్థలాలకు భూసేకరణ విషయంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం దీనిపైనే ఆరోపణలు చేస్తున్నారు.ఇళ్ల స్థలాల కోసం భూముల సేకరణ, వాటి చదును కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపణలున్నాయి. దీనికి తోడు ఇసుక తవ్వకాలపై కూడా అనేక మంది ఎమ్మెల్యేలపై విమర్శలు విన్పిస్తున్నాయి. దీంతో తాడేపల్లిలో ఉన్న జగన్ కు పూర్తి స్థాయి సమాచారం రావాలంటే పార్టీ నేతలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చెబుతారన్న నమ్మకం లేదు. దీంతో జగన్ దీనికి సొంతంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.దీంతో సొంతంగా ఏర్పాటు చేసుకున్న నిఘా వ్యవస్థ ద్వారా నివేదిలకను ఎప్పటికప్పుడు జగన్ తెప్పించుకుంటున్నారు. ఇటీవల ఒక ఎమ్మెల్యే కు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆ ఎమ్మెల్యే ఉత్సాహంగా వెళ్లారట. అయితే మూడు గంటలు వెయిట్ చేసిన తర్వాత జగన్ నుంచి పిలుపు రావడంతో తనకు శుభవార్త చెబుతారనుకుని మురిసిపోయారు. కానీ ఇసుక తవ్వకాలు, ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములు ఎక్కడెక్కడ ఎప్పుడు కొనుగోలు చేసిందీ జగన్ చెప్పడంతో ఆ ఎమ్మెల్యే అవాక్కయ్యారట. జగన్ క్లాస్ పీకి పపండంతో బతుకు జీవుడా అని ఆ ఎమ్మెల్యే బయటపడ్డారట.ఒకప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వస్తుందంటే పదవుల ఇవ్వడం కోసమని గంతులేసేవారు. కానీ ఇప్పుడు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందనుకుంటే క్లాస్ పీకడానికనే భావించి ఎమ్మెల్యేలు జడిసిపోతున్నారట. స్థలాల వివరాలు, ఇసుక తవ్వకాలు ఎంత జరిపిందీ జగన్ వారి ముందే చెబుతుండటంతో ఎమ్మెల్యేలు విస్తుపోతున్నారట. జగన్ ఇలా తన సొంతంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని, పార్టీ నేతలను కట్టడి చేయానికేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద జగన్ విపక్షం చేస్తున్న విమర్శలు, పత్రికల్లో వస్తున్న వార్తలపై క్రాస్ చెక్ చేసుకోవడానికి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారంటున్నారు.