YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ముగిసిన ప్రణబ్ శకం

ముగిసిన ప్రణబ్ శకం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1, 
ప్రణబ్ ముఖర్జీ… భారత రాజకీయాలలో భీష్మ పితామహుడు లాంటివారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ ధీశాలి. ఎక్కడో పశ్చిమ బెంగాల్ లో పుట్టి పెరిగి జాతీయ రాజకీయాల్లో రాణించిన మేరు నగరం. అయిదు పదుల రాజకీయ ప్రస్థానంలో ప్రణబ్ ముఖర్జీ అందుకోని పదవిలేదు. చేపట్టని బాధ్యత లేదంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్ సభ, కేంద్రమంత్రి, చివరికి రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి చేపట్టిన మహానేత. ప్రస్థానమంతా కాంగ్రెస్ లో గడిపిన ప్రణబ్ ముఖర్జీ గత ఏడాది కేంద్రం అత్యున్నతమైన భారతరత్న పురస్కారంతో గౌరవించింది. దేశానికి తాను చేసిన సేవ కన్నా, దేశమే తనకు ఎంతో ఎక్కువ ఇచ్చిందని వినమ్రంగా చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనంప్రణబ్ ముఖర్జీ ని చూసి నేటితరం నాయకులు నేర్చుకోవలసి ఉంది. ఆయన నిరంతర అధ్యయన శీలి. పార్టీని నమ్ముకున్న నేత. అవకాశాలు అందినట్టే అంది ఆఖరి క్షణంలో చేజారినప్పట్టికి నైరాశ్యానికి గురికాకుండా ముందుకు సాగిన నాయకుడు. 1984 అక్టోబరు31న నాటి ప్రధాని ఇందిర హత్యతో ఆర్థికమంత్రిగా కేబినెట్ లో రెండోస్థానంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అవుతారని అందరూ భావించారు. కానీ సీనియర్ అయిన ప్రణబ్ ముఖర్జీ తనకు ముప్పు కాగలరని భావించిన ఇందిర తనయుడైన రాజీవ్ ఆయనను పక్కన పెట్టారు. ఇలా మొదటిసారి అవకాశం వచ్చినట్లే వచ్చి వెనక్కు పోయింది. రెండోసారి 2004లో యూపీఏ సార్వత్రిక ఎన్నికలలో గెలిచాక అందరూ ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అవుతారని భావించారు. నాటి యూపీఏ అధినేత్రి సోనియాకు ఆయన అప్పట్లో కళ్లుచెవుల్లా వ్యవహరించారు. ఆమెకు అన్ని విషయాలలో మార్గదర్శకుడిగా వ్యవహరించారు. చివరికి మన్మోహన్ వైపు సోనియా మొగ్గు చూపడంతో ప్రణబ్ ముఖర్జీకి నిరాశే మిగిలింది. మంత్రివర్గంలోనూ అంతగా ప్రాధాన్యం లేని రక్ష్ణణ శాఖను కేటాయించినప్పటికి మారు మాట్లాడలేదు. ఇది పార్టీపట్ల ఆయన నిబద్దతకు నిదర్శనం.ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. 1982లో ఇందిర మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా రిజర్వు బ్యాంకు గవర్నరుగా మన్మోహన్ సింగ్ ను నియమించిన విషయం చాలా మందికి తెలియదు. ఒకప్పుడు తాను నియమించిన అధికారి వద్ద మంత్రిగా పనిచేయవలసి వచ్చినా ప్రణబ్ ముఖర్జీ మౌనమేవహించారు తప్ప ఎలాంటి అసమ్మతిని వ్యక్తం చేయలేదు. 2007లో సీనియర్ అయిన తనను కాదని అప్పటి రాజస్థాన్ గవర్నర్ ప్రతిభా పాటిల్ ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినా ఆయన పల్లెత్తు మాట మాట్లాడలేదు. సీనియర్ అయిన ప్రణబ్ సేవలు పార్టీకి అవసరమన్న ఉద్దేశంతో ఆయనను ఎంపిక చేయలేదని అప్పట్లో పార్టీ ప్రకటించింది. కానీ దీనిని ఎవరూ విశ్వసించ లేదు. పార్టీ పట్ల ఈ తిరుగులేని విధేయతే ఆయనకు 2012లో రాష్ట్రపతి పదవికి మార్గం సుగమం చేసింది. తద్వారా దేశంలో అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. ప్రధాని కాలేనప్పటికీ దేశాధ్యక్షడయ్యారు. అతి చిన్న వయసులోకీలకమైన ఆర్థికమంత్రి పదవి చేపట్టిన ఘనత ఆయనదే. 1982లో ఇందిర మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా చేరేనాటికి ఆయన వయసు కేవలం నాలుగు పదులే. ఎలాంటి ఆర్థిక నేపథ్యం లేనప్పట్టికీ ఆర్థికశాఖను కట్టబెట్టడం విశేషం. ఆయన కోలకతా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చరిత్ర, పొలిటికల్ సైన్స్ , లా చదివారు. అయినప్పటికీ ఆర్థిక విషయాలపై మంచిపట్టు ఉండేది. ఈ అవగాహనే ఆయనను అత్యున్నత స్థానానికి చేర్చింది.బెంగాల్ లోని బీర్బుం జిల్లాలోని మిరాఠి గ్రామంలో 1935లో సంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రణబ్ ముఖర్జీ పరమ భక్తుడు. ఏటా దసరా పండగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి పూజలు చేస్తారు. అలా అని ఛాందసవాది కానే కాదు. లౌకికవాదం, పరమత సహనం పట్ల పూర్తి నమ్మకం గల నేత. 1952 నుంచి 1964 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 1969 జులైలో మిడ్నపూర్ లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా క్రియాశీలకంగా పనిచేసి నాటి ప్రధాని ఇందిర మన్ననలు పొందారు. దీంతో ఆమె ఆయనను అదే ఏడాది రాజ్యసభకు పంపారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. వరసగా 1975, 1981, 1993, 1999లో ఎగువసభ సభ్యుడిగా పనిచేశారు. 1980 నుంచి 1985 వరకు ఎగువసభ నాయకుడిగా వ్యవహరించారు. ప్రణబ్ ముఖర్జీ ప్రజా నాయకుడు కాదని ఆయనదంతా దొడ్డిదారి రాజకీయమేనన్న విమర్శ ఉండేది. దీనిని తిప్పికొట్టేందుకు 2004 ఎన్నికలలో సొంత నియోజకవర్గమైన జాంగీపూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికై విమర్శకుల నోళ్లు మూయించారు. 2009 లోనూ ఇక్కడి నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ప్రణబ్ కూతురు శర్మిష్ట ప్రఖ్యాత నాట్యకారిణి. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రణబ్ భార్య సువ్ర ముఖర్జీ బంగ్లాదేశ్ కు చెందినవారు. ఆమె కాలం చేశారు.రాజీవ్ హయాంలో తెరమరుగైన ప్రణబ్ ముఖర్జీ 1991లో పీవీ నరసింహారావు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చారు. ఆయనను ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ గా నియమించారు. తరవాత కాలంలో కేబినెట్ లోకి తీసుకుని కీలకమైన విదేశాంగ శాఖను అప్పగించారు. 2004లో మన్మోహన్ హయాంలో రక్ష్ణ,ణ,విదేశాంగ, ఆర్థిక వంటి కీలక శాఖలను సమర్థంగా నిభాయించారు. వాటికి వన్నెతెచ్చారు. మన్మోహన్ లోక్ సభ సభ్యుడు కాకపోవడంతో ప్రణబ్ లోక్ సభ నాయకుడిగా వ్యవహరించారు. మన్మోహన్ అనారోగ్య సమయంలో కేబినెట్ సమావేశాలకు అధ్యక్ష్యత వహించారు. పార్టీ, ప్రభుత్వపరంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆయన తెరపైకి వచ్చేవారు. వాటిని పరిష్కరించడంలో ఆయన ముందుండేవారు. అందుకే ఆయనకు క్రైసిస్ మేనేజర్ అనే పేరుండేది. ఈ నైపుణ్యమే ఆయనను పార్టీకి దగ్గర చేసింది. నెహ్రూ, ఇందిర, రాజీవ్ …ఇలా మూడు తరాలతో కలసి పనిచేసిన ప్రణబ్ జాతిరత్నం అని చెప్పడం అతిశయోక్తి కాదు.

Related Posts