నల్గొండ సెప్టెంబర్ 1,
అమాయకులు.. నిరుపేదలే లక్ష్యంగా... పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి సరోగసి పేరుతో మహిళలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. భర్తతో గొడవ పడి ఇంట్లోంచి వెళ్లిపోయిన మహిళను ట్రాప్ చేసి సరోగసి పేరుతో చెన్నై తరలించారు ఈ ముఠా. డబ్బు ఆశచూపి ఇష్టం లేకపోయినా బలవంతంగా అద్దెగర్భానికి అంగీకరించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. భార్య కనబడటం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగమంతా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీలత.. భర్తతో గొడవ పడి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళా ఏజెంట్లు శ్రీలతను బలవంతంగా సరోగసికి ఒప్పించారు. ప్రాసెస్ కోసం ఏజెంట్లైన వాణి, కుమారిలు... శ్రీలతను చెన్నైకు తరలించారు. అయితే నెల రోజులుగా తన భార్య కనిపించకపోవడంతో పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు శ్రీలత భర్త రాజు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు శ్రీలత చెన్నైలో ఉన్నట్లు గుర్తించి స్వస్థలానికి తీసుకువచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఏజెంట్లు తనను బలవంతంగా సరోగసికి ఒప్పించారని... తనకు ఇష్టంలేకపోయినా మాయమాటలు చెప్పి చెన్నై తీసుకువెళ్లారని ఆరోపిస్తోంది శ్రీలత. అంతేకాదు.. ఏజెంట్లు తన భర్తతో గొడవపడి దూరంగా ఉండాలని కూడా తనకు సూచించినట్లు చెప్పుకొచ్చింది. తనకు అసలు అద్దె గర్భం ఇష్టంలేదని... ఏజెంట్లు వాణి, కుమారిలు బలవంతం చేసి తీసుకెళ్లారని ఆరోపిస్తోంది. భర్త రాజు కూడా తన భార్యను మోసం చేసి సరోగసికి యత్నించారని చెబుతున్నాడు. అయితే ఏజెంట్లు మాత్రం శ్రీలత ఇష్టంతోనే అద్దెగర్భానికి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు 3 లక్షల డీల్ కూడా కుదిరిందని కుమారి చెబుతోంది.