న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1
రైల్వే ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ మరిన్ని ట్రైన్స్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. రైల్వే ప్రయాణికుల కోసం మరిన్ని ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నామని తెలిపింది.ట్రైన్ ప్యాసింజర్ల కోసం మరిన్ని స్పెషల్ ట్రైన్స్ నడపాలని యోచిస్తున్నామని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇకపోతే ఈరోజు నుంచి అన్‌లాక్ 4 నిబంధనలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం 230 స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. అతిత్వరలోనే ఇండియన్ రైల్వేస్ దాదాపు 100 ట్రైన్లను నడిపే అవకాశముందని నివేదికలు వెలువడుతున్నాయి. వీటిల్లో ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్ ట్రైన్స్ ఉంటాయి. హోం మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటికే కొత్త ట్రైన్లు నడపడానికి రైల్వే శాఖకు అనుమతి కూడా లభించిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇకపోతే ఇప్పుడు కేవలం స్పెషల్ ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి. సాధారణ ట్రైన్లు తిరగడం లేదు. కరోనా వైరస్ కారణంగా ఇండియన్ రైల్వేస్ ట్రైన్లను నడపడం లేదు. ఎప్పటి నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమౌతాయో కూడా కచ్చితంగా తెలియదు. కాగా ఇండియన్ రైల్వేస్ దశల వారీగా ట్రైన్ సర్వీసులు పునరుద్ధించే అవకాశమంది.