ఏలూరు, సెప్టెంబర్ 2,
రాజకీయాల్లో కులాలకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు ప్రధాన కులాలు.. కాపు, శెట్టిబలిజల మధ్య ఉండే పోటీ ఎక్కువే. ఇక, క్షత్రియ కమ్యూనిటీ కూడా రాజకీయంగా చక్రం తిప్పడం తెలిసిందే. అయితే పశ్చిమ డెల్టాతో పాటు తూర్పులోని కోనసీమలో కాపులు వర్సెస్ శెట్టిబలిజల మధ్య ఎప్పుడూ తీవ్రమైన రాజకీయ, సామాజిక వైరం నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఇద్దరు కీలక నాయకులు శెట్టి బలిజ కమ్యూనిటీ తరఫున మూడు దశాబ్దాలకు పైగానే చక్రం తిప్పారు. వారే మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లిన వైసీపీ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మరొకరు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ.తూర్పులో బోసు శెట్టి బలిజ తరఫున చక్రం తిప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలోను, తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు కూడా బోసు తనదైన శైలిలో శెట్టిబలిజలను తనవైపు తిప్పుకొన్నారు. అసలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ కమ్యూనిటీ పరంగా మాత్రం బోస్, పితాని సత్యనారాయణ చెప్పినట్టే నడిచేది. ఇక, ఇప్పుడు బోసు రాజ్యసభకు వెళ్లిపోయినా…. మంత్రిగా చెల్లుబోయిన వేణు వచ్చినా.. కూడా శెట్టిబలిజ కమ్యూనిటీ మాత్రం బోసునే తమకు పెద్దరికంగా చూసుకుంటుండడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే.. పితాని సత్యనారాయణ శెట్టిబలిజ వర్గం తరఫున చక్రం తిప్పారు. ఈయనకు ఇటీవల కాలంలో బ్రేకులు పడుతున్నాయి.వైఎస్సార్ సీపీ తరఫున రంగంలోకి దిగిన కౌరు శ్రీనివాస్.. పితాని సత్యనారాయణకి గట్టిపోటీ ఇస్తున్నారు. యువ నాయకుడు కావడం..పార్టీ తరఫున కీలకంగా ఉండడంతో జగన్ కూడా కౌరును ప్రోత్సహిస్తున్నారు. వైసీపీలో ఎంపీపీ స్థాయి నుంచి ఎదిగిన కౌరు జగన్ చెప్పినట్టు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి రంగరాజు కోసం ఆచంట సీటు త్యాగం చేశారు. ఇక ఎన్నికల తర్వాత జగన్ పాలకొల్లులో గత ఎన్నికల్లో ఓడిన బాబ్జీని తప్పించి, అక్కడ సీనియర్ నేత మేకా శేషుబాబు లాంటి వాళ్లు కాదని మరీ కౌరుకు ఇంచార్జ్ పగ్గాలు ఇచ్చారు. ఆ వెంటనే డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చారు. దీంతో కౌరు దూకుడుగా ఉన్నారు.ఇక, కౌరు దూకుడును గుర్తించిన జగన్ .. త్వరలోనే ఆయనకు జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ పదవి కూడా ఇస్తే కౌరు తన కమ్యూనిటీలో తిరుగులేని నేతగా ఎదగడంతో పాటు భవిష్యత్తులో మరింత కీలక నేతగా మారతారు అనడంలో సందేహం లేదు. ఈ పరిణామాలతో శెట్టిబలిజ యూత్ అంతా.. కూడా కౌరు వెంటే నడుస్తున్నారు. పైగా ఆయనకు ఇక్కడ సంపూర్ణంగా మద్దతు కూడా లభిస్తుండడం గమనార్హం. మూడు దశాబ్దాల తర్వాత శెట్టిబలిజల్లో పితాని సత్యనారాయణని మించిన క్రేజ్ ఉన్న నాయకుడుగా కౌరు వచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే.. ఏడాదిన్నర కిందటి వరకు మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణ ఓటమితో శెట్టి బలిజ వర్గాలకు దూరమయ్యారనే భావన వ్యక్తమవుతోంది.కౌరు దూకుడు ఒకవైపు.. తాను నమ్ముకున్న టీడీపీ ఓటమి పాలవడం, సమీప భవిష్యత్తులోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో పితాని సత్యనారాయణ తీవ్ర ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. ఇక ఆచంట నియోజకవర్గంలోనూ మంత్రి రంగరాజు ఉండడంతో పితాని సత్యనారాయణ రాజకీయం శూన్యమైంది. పైగా పితాని తన వారసుడిని రంగంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ, కౌరు దూకుడుతో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఆయన పార్టీలో ఉండాలా? వైసీపీలోకి రావాలా? అనే తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు. టీడీపీలో ఉంటే తనకు, తన వారసుడికి కూడా భవిష్యత్ లేదు సరికదా ? అటు సామాజిక వర్గంలో తన ఆధిపత్యానికి కూడా గండిపడేలా ఉంది. అందుకే ఇప్పుడు పితాని వైసీపీ చూపులు చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీలో బెర్త్‌లు ఫుల్ అవ్వడం కూడా ఆయనకు మైనస్ కానుంది.