YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆర్ధిక ఇబ్బందుల్లో ఏపీ సర్కార్

ఆర్ధిక ఇబ్బందుల్లో ఏపీ సర్కార్

విజయవాడ, సెప్టెంబర్ 2, 
ఏపీ స‌ర్కారుకు వ్యూహం లోపించిందా ? ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్రద‌ర్శించిన దూకుడు ఇప్పుడు ప్రభుత్వ ప‌య‌నాన్ని ప‌తనావ‌స్థకు చేర్చుతోందా? ముప్పేట దాడిలో జ‌గ‌న్ స‌ర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రభుత్వం ఏర్పడి కేవ‌లం ఏడాదిన్నర మాత్రమే అయింది. అయితే, ఇంత‌లోనే భారీస్థాయిలో అప్పులు చేయ‌డం, ఇప్పటికే భారీ అప్పులు చేసిన యూపీ వంటి రాష్ట్రాల‌ను ఏపీ హైజాక్ చేసే స్థాయికి చేరింద‌నే వార్తలు వ‌స్తుండ‌డం, మ‌రోప‌క్క, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుల‌పై క‌న్నెర్ర చేస్తున్నట్టు వార్తలు వ‌స్తుండ‌డం జ‌గ‌న్ స‌ర్కారుకు ఇబ్బందిగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆర్థిక సంవత్సరం మొదలై ఆరు నెలలు కూడా కాలేదు! అంతలోనే… రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠ స్థాయిలో అప్పులు చేసింది. కొత్త అప్పుల కోసం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. లేకుంటే.. డబ్బు అందుబాటులో లేక రెండు నెలలుగా వేతనాలు సకాలంలో అందించలేకపోతున్నారు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలను ఐదో తేదీన మొదలుపెట్టి 15వ తేదీ వరకు వస్తున్నారు. ఆగస్టు నెల వేతనాలకు కూడా తిప్పలు తప్పేలా లేవు. గత నెల వరకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ద్వారా బాండ్లు వేలం వేసి తెచ్చిన అప్పులతో ఎలాగోలా వేతనాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేదని తెలుస్తోంది.మ‌రి ఇంత‌లా ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దెబ్బతిన‌డానికి కార‌ణం ఏంటి ? ఎందుకిలా జ‌రిగింది ? అంటే.. మేనిఫెస్టోనే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒకింత ఆచితూచి ప్రజ‌లకు హామీలు కుమ్మరించిన జ‌గ‌న్‌.. రైతు రుణ‌మాఫీ వంటివి చేయ‌లేన‌ని కుండ‌బ‌ద్దలు కొట్టారు. ఫ‌లితంగా ఆయ‌న ప్రతిప‌క్షానికి ప‌రిమిత‌మయ్యారు. ఈ ఎఫెక్ట్‌తో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అన్ని వ‌ర్గాల‌ను అక్కున చేర్చుకునేందుకు నిధుల పందేరానికి పెద్దపీట వేశారు. చిన్నా పెద్ద.. తేడా లేకుండా అనేక ప‌థ‌కాలు డ‌బ్బుల పంప‌కంతోనే ముడిప‌డ్డాయి. దీంతో ఏటా.. కొన్ని వేల కోట్లు ఇలా వ‌చ్చి అలా మ‌ళ్లీ ప్రజ‌ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.ఫ‌లితంగా ప్రభుత్వం వ‌ద్ద రూపాయి కూడా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఏం చేయాలి? అని జ‌గ‌న్ ప్రభుత్వం త‌ల్లడిల్లుతోంది. మాట త‌ప్పన‌న్న వాద‌న‌ను బ‌లంగా ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లిన జ‌గ‌న్‌ ఇప్పుడు ఆయా ప‌థ‌కాల‌ను నిలిపివేయ‌లేరు. అలాగ‌ని లేని నిధులు తేలేరు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడే ప‌రిస్థితి ఇలా ఉంటే.. మ‌రో మూడున్నరేళ్లపాటు ప్రభుత్వాన్ని న‌డ‌పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించాలి. మ‌రి ఇవ‌న్నీ సాధ్యమ‌య్యే ప‌రిస్థితి ప్రస్తుత ఆర్థిక స్థితిని చూస్తే క‌నిపించడం లేద‌నేది అధికార పార్టీ సానుభూతి ప‌రుల నుంచే వినిపిస్తున్న మాట‌. మ‌రి జ‌గ‌న్ ఈ స‌వాళ్లు ఎలా ఎదుర్కొంటారో ?

Related Posts