విజయవాడ, సెప్టెంబర్ 2,
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవస్థల ప్రక్షాళన గురించి ఎక్కువగా మాట్లాడుతున్న, ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. స్వతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ప్రయత్నించని, ఆలోచన చేయని అంశంపై జగన్ దృష్టి పెట్టారు. రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమగ్ర భూసర్వే చేయాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగా ఈ సర్వే విజయవంతంగా పూర్తి చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ, ఏ మాత్రం పొరపాట్లు జరిగినా అసలుకే మోసం వచ్చి ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కారణం కావచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో 1930 ప్రాంతంలో బ్రిటీష్ హయాంలో రాష్ట్రమంతా సమగ్ర భూసర్వే జరిపి రికార్డులు రాశారు. నిజానికి భూసర్వే అనేది ప్రతి 30 ఏళ్లకు ఒకసారైనా జరగాలి. కానీ, రాష్ట్రంలో సుమారు 90 ఏళ్ల నుంచి భూసర్వే అనేదే జరగలేదు. దీంతో బ్రిటీష్ హయాంలోని రికార్డులే ఇప్పటికీ ప్రామాణికంగా ఉన్నాయి. గతంలో కొన్ని ప్రభుత్వాలు భూసమస్యల పరిష్కారానికి రీసర్వే ఒక్కటే పరిష్కారం అని భావించాయి కానీ అంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టే సాహసం చేయలేదు. ఇప్పుడు జగన్ ఈ పని చేయాలని నిర్ణయించుకున్నారు. 90 ఏళ్లుగా భూసర్వే చేయకపోవడంతో రాష్ట్రంలో భూసమస్యలు పేరుకుపోయాయి. ఫీల్డ్‌కు, రికార్డులోని వివరాలకు తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక రికార్డులో ఒక సర్వే నంబరుపై ఎవరికైనా భూమి ఉంటే క్షేత్రస్థాయిలో ఆ వ్యక్తి వ్యవసాయం చేసుకునే భూమి మరేదో సర్వే నంబరులో ఉంటుంది. భూమి విస్తీర్ణాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. సర్వే నంబర్లకు సంబంధించి రికార్డుల్లో సబ్ డివిజన్ అయి ఉంటుంది కానీ ఫీల్డ్‌లో కాలేదు. ఇలా అనేక రకాల భూసమస్యలు ఉన్నాయి.గ్రామాల్లో రైతుల మధ్య గొడవలకు కూడా భూవివాదాలే ప్రధాన కారణం. రైతులు ఈ సమస్యల పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి సమయాన్ని, డబ్బులను వృథా చేసుకుంటున్నారు. భూసమస్యల పరిష్కారానికి సమగ్ర భూసర్వే ఒక్కటే మార్గమని భూచట్టాల నిపుణులు చాలా రోజులుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం తెలంగాణలో భూసర్వే చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. వంద రోజుల్లోనే రాష్ట్రమంతా సర్వే పూర్తి చేసి కొత్త రికార్డులు తయారుచేయాలని మొదట భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్నాక ఇది సాధ్యం కాదని ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కేవలం భూరికార్డుల ప్రక్షాళన మాత్రమే చేసింది. అందులో కూడా అనేక సమస్యలు వచ్చాయి. మూడు నెలల్లో పూర్తి చేయాలనుకున్న ఈ కార్యక్రమం మూడేళ్లు అవుతున్నా పూర్తి కాలేదు.ఇప్పుడు జగన్ ఏకంగా జనవరి 1 నుంచి భూసర్వేనే చేయాలని నిర్ణయించారు. అయితే, ఇందుకు చాలా సమయం పడుతుందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే సుమారు రెండేళ్ల ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీని వాడాలని నిర్ణయించుకుంది. భూసర్వే చేసినప్పుడు రైతుల మధ్య చాలా భూవివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వీటి పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రభుత్వ ఆలోచన బాగానే ఉంది. కానీ, ఈ కార్యక్రమం అంతా పక్కాగా జరగాలి. కింది స్థాయి ఉద్యోగులకు సరైన శిక్షణ అవసరం. సిబ్బంది సంఖ్య చాలా పెరాగాల్సి ఉంటుంది. ఎటువంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి కావాలి. భూవివాదాల్లో రైతులకు న్యాయం జరగాలి. ఒకప్పుడు భూమి అనేది కేవలం బతుకుదెరువు, ఆత్మగౌరవంగా మాత్రమే ఉండేది. ఇప్పుడు భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి, భూసర్వే ద్వారా రైతులకు మేలు జరగాలి కానీ లోపాలు తలెత్తి కొత్త సమస్యలు వస్తే మాత్రం వారిలో ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భూసర్వే సక్రమంగా జరిగితే ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది.