YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉజ్జయని శివుడ్ని తాకొద్దు

ఉజ్జయని శివుడ్ని తాకొద్దు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2, 
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గర్భగుడిలోకి భక్తుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అరుణ్ మిశ్రాకు ఇదే చివరి తీర్పు కావడం గమనార్హం.ఉజ్జయినీ ఆలయంలోని జ్యోతిర్లింగం క్షీణిస్తున్నందున గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. జ్యోతిర్లింగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జస్టిస్‌ అరుణ్ మిశ్రా అన్నారు. సంప్రదాయ పూజా కార్యక్రమాల సమయంలో పూజారులు మాత్రమే శివలింగాన్ని తాకవచ్చునని.. ఇక భక్తులెవరూ జ్యోతిర్లింగాన్ని తాకడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.‘ఇక భక్తులెవరూ శివలింగాన్ని తాకడానికి వీల్లేదు. సంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా పూజారులు మాత్రమే జ్యోతిర్లింగాన్ని తాకుతారు. పవిత్ర కైంకర్యాలు నిర్వహిస్తారు. శివలింగాన్ని పరిరక్షించడానికి ఆలయ కమిటీ పటిష్ట చర్యలు తీసుకోవాలి’ అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.‘భక్తులెవరూ శివలింగానికి నెయ్యి, తేనె, పెరుగు లాంటి పదార్థాలను పూయడానికి వీల్లేదు. ఇలాంటి చర్యలన్నింటితో శివలింగం క్షీణిస్తోంది. ఆలయ కమిటీ అనుమతితో కేవలం కొన్ని స్వచ్ఛమైన పాలను మాత్రమే శివలింగంపై పోయవచ్చు. భక్తులు, ఆలయ కమిటీ తరఫున పూజారులే సంప్రదాయ కైంకర్యాలను నిర్వహిస్తారు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని.. గర్భగుడిలో 24 గంటల పాటు జరిగే కార్యక్రమాలను రికార్డు చేయాలని ఆలయ కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ వీడియో క్లిప్పింగులను ఆరు నెలల పాటు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. పూజారులు, ఆలయ సిబ్బందితో పాటు భక్తులెవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Related Posts