తిరుపతి, సెప్టెంబర్ 2,
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురష్కరించుకుని కుప్పం-పలమనేరు రహదారి పక్కన అభిమానులు కటౌట్ పెడుతుండగా ప్రమాదం జరిగింది. మొత్తం 10 మంది పవన్ అభిమానులకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కుప్పంలోని పీఈయస్ హాస్పిటల్‌కు తరలించారు.30 అడుగుల ఎత్తున్న కటౌట్ పెడుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా పోలీసులు గుర్తించారు. వీరంతా శాంతిపురం మండలం కడపల్లి గ్రామానికి చెందినవారు. చెట్టంత కొడుకులు ఇలా అకాల మరణం చెందడంపై వారి కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.కాగా, పవన్ కళ్యాణ్ 49వ ఏట అడుగుపెట్టారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలను జరుపుకోరు. ఇలాంటి ఆడంబరాలకు ఆయన దూరంగానే ఉంటారు. అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున పవన్ పుట్టినరోజు వేడుకలు జరుపుతారు. అయితే, ఈసారి పవన్ అభిమానులు, జనసైనికులు తమ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని హాస్పిటల్స్‌కి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు అందజేశారు. జనసైనికులు తీసుకున్న ఈ మంచి పనిని పవన్ కూడా అభినందించారు. ఇలాంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరం.
2 లక్షల ఆర్థిక సహయం :పవన్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్ల చేస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలులో పవన్ ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు అన్నారు.. జనసైనికుల కుటుంబాలకు అండగా ఉంటాను అన్నారు.గుండెల నిండా తన పట్ల అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు పవన్. ఈ వార్త తన మనసుని కలచివేసిందని.. ఇది మాటలకు అందని విషాదమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.. ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనని.. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక తల్లిదండ్రులకు తానే ఒక బిడ్డగా నిలుస్తానని భరోసా నింపారు.మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని జనసేనాని ఆదేశించారు. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో నలుగురు జన సైనికులు హరికృష్ణ, పవన్, సుబ్రహ్మణ్యం, అరుణ్ చికిత్స పొందుతున్నారు అనే సమాచారం ఉందని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించారు.