జమ్మూ, సెప్టెంబర్ 2,
తూర్పు లడఖ్‌లో సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చూషుల్- పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లోని భూభాగంలోకి చైనా సైన్యం చొరబాటుకు ప్రయత్నించిగా, భారత్ దీనిని దీటుగా తిప్పికొట్టింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (సీపీఎల్ఏ) కదలికలను పసిగట్టిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమై వారిని నిలువరించింది. ఆగష్టు 29న రాత్రి సమయంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని భారత సైన్యం ప్రకటించింది. ఎల్ఏసీ ఏల్ఏసీ వెంబడి ఏకపక్షంగా యథాతథస్థితి మార్చేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టిన భారత్ ఆ ప్రాంతంలో సైన్యాన్ని బలోపేతం చేస్తోంది. ఇరు దేశాలు సైనిక బలగాలు, యుద్ధ ట్యాంకులు, ఇతర భారీ ఆయుధాలను మోహరిస్తున్నాయి.పాంగాంగ్ సరస్సు తీరం, రెజాంగ్ లా, రఖీన్ లా, స్పాంగర్ గ్యాప్‌లోని పలు ప్రాంతాల్లోకి చొరబడేందుకు చైనా చేసిన ప్రయత్నాలను భారత సైన్యం అడ్డుకుంది.‘మన సైన్యానికి వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) గురించి అవగాహన ఉంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని దాటదు. పాంగోంగ్ సరస్సు ఉత్తర తీరంలోని ‘ఫింగర్ ఏరియా’లో మాదిరిగా, ప్రస్తుతం చైనా చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతో దానిని నిరోధించడానికి సైన్యం కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది’ ఓ సీనియర్ అధికారి అన్నారు.పీఎల్ఏ దళాలు పాంగోంగ్ సరస్సు, స్పాంగ్‌ర్ గ్యాప్ దక్షిణ తీరంలోని కొన్ని ప్రదేశాలలో మా స్థానాలకు దగ్గరగా రావడానికి ప్రయత్నించాయి. తగిన జాగ్రత్తలు తీసుకుని వారిని స్పష్టంగా వెనక్కు పంపాలని మన సైనికులు కోరుకున్నారు.. ఫ్లాగ్ మీటింగ్‌లో కూడా హెచ్చరిక చేశాం’ అని అన్నారు.తూర్పు లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల సరిహద్దులో ఉత్తరం నుంచి దక్షిణానికి విస్తరించిన దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) దెప్సాంగ్, గాల్వన్, హాట్ స్ప్రింగ్స్, పాంగోంగ్ సరస్సు, చుషుల్, దెమ్‌చోక్, చుమార్ సెక్టార్ వంటి చోట్ల భారత సైనికుల సహనాన్ని సీపీఎల్ఏ పరీక్షిస్తోంది. ఉదాహరణకు, సీపీఎల్ఏకు చెందిన అనేక వాహనాలు చుమార్ సెక్టార్‌లోని ఎల్‌ఏసీకి దగ్గరగా వచ్చాయి.. కానీ, చొరబాటుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని’ ఒక అధికారి తెలిపారు. అత్యున్నతస్థాయి చైనా స్టడీ గ్రూప్ (సీఎస్జీ) సమావేశమై తాజా పరిస్థితి, ఎదురయ్యే ఆకస్మిక పరిస్థితులను సమీక్షించింది... ఇది రెండు గంటల పాటు కొనసాగింది.. దీనికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణే తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, చూషుల్-మోల్డో బిపిఎమ్ వద్ద వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ఫ్లాగ్ సమావేశం కూడా జరిగింది.. కానీ ఎటువంటి పురోగతి లేదు’ మరొ అధికారి చెప్పారు.