YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నీటి కష్టాలు షురూ

నీటి కష్టాలు షురూ

వేసవి తెలంగాణ ప్రాంతంలో నీటి వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఏటికేడు పెరుగుతున్న ఎండలు, నీటి వినియోగం భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో జనాభాకు తగినట్లుగా నీరు అందుబాటులో ఉండడంలేదు. సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మార్చ్ నుంచే నీటి కష్టాలు మొదలైపోతున్నారు. బిందెడు నీటి కోసం ప్రజలు భగీరథ ప్రయత్నాలే చేస్తున్న దుస్థితి పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రజలు పనులకు వెళ్లకుండా నీటిని తెచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నారు. నీరు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని బిందెలు, డ్రమ్ములను ఎడ్లబండ్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై పెట్టుకుని బయలుదేరుతున్నారు. గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. పట్టణాల్లో మరోరకంగా నీటి కష్టాలు విస్తరిస్తున్నాయి. కరీంనగర్ పట్టణ ప్రాంతంలో తాగు నీటికి సమస్యలు ఏర్పడుతుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పట్టణానికి నీటి వనరుల కొరత ఏర్పడితే సమస్యను పరిష్కరించేందుకు కష్టమని అభిప్రాయపడుతున్నారు. దిగువ మానేరు జలాశయంలో నీరు అడుగంటుతుండడం వల్లే స్థానికంగా తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశంముందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

దిగువ మానేరు జలాయశంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరినట్లు కరీంనగర్ వాసులు అంటున్నారు. నీరు దిగువకు వదులుతుండటంతో నీటిమట్టం దారుణంగా పడిపోతోందని చెప్తున్నారు. జలాశయంలో నీళ్లు అందకపోవడంతో మూడు రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవలిగా ఎండలు మండుతుండటంతో పట్టణంలో నీటి అవసరాలు పెరిగిపోయాయి. నీటి వినియోగం అధికంగా ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దిగువ మానేరు జలాయశంలో నీటి సామర్థ్యం 920 అడుగులు. అయితే రోజురోజుకు నీటిశాతం తగ్గిపోవడంతో ఆశించిన స్థాయిలో నీటిశుద్ధి కేంద్రానికి నీరు అందడం లేదు. ప్రస్తుతం 883.80 అడుగుల లోతులో నీళ్లు ఉండగా 877 అడుగులకు చేరితే ఇంటెక్‌వాల్వ్‌లకు నీరు అందే పరిస్థితి ఉండదని అధికారులే అంటున్నారు. నగరానికి అందించే తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. బూస్టర్లకు నీరందకపోతే డ్యాం నుంచి మోటార్లు పెట్టి ఎత్తిపోసే పరిస్థితి రానుంది. మూడు రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. దీంతో పలు డివిజన్లలోని కార్పోరేటర్లు ట్యాంకర్లతో అప్పటికప్పుడు నీటిని సరఫరా చేయించి ప్రజాగ్రహాన్ని కొంతమేర చల్లబరిచారు. అయితే ఇలా ఎన్ని రోజులు చేయగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పట్టణంలో సాగునీటికి సమస్యల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related Posts