అనంతపురం సెప్టెంబర్ 2
అనంతపురంలో గన్ బెదిరింపు కలకలం రేపింది. నగరంలో ఓ ఫైనాన్స్ కార్యాలయంలో గన్ తో బెదిరించి గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. ఒక్కసారిగా కార్యాలయంలోకి ప్రవేశించి, యాసిడ్ బాటిల్స్ వేసి భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు రివాల్వర్‌తో కార్యాలయం సిబ్బందిపై దాడికి ప్రయత్నించి నగదు దోచుకెళ్లారు. దోపిడీకి రెండు రోజుల ముందే దుండగులు రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం. బంగారు నగలు తాకట్టు పెట్టాలంటూ ఫైనాన్స్ కార్యాలయంలో ఇద్దరు యువకులు కలిసి మాట్లాడి వెళ్లారు. ఆ సమయంలోనే కార్యాలయంలో పనిచేస్తున్న వారి సంఖ్య, అందులోని భద్రతా ప్రమాణాలను వారు క్షుణ్ణంగా పసిగట్టి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు మాస్క్ లు ధరించి మణప్పురం కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో తాము బంగారు నగలు తాకట్టు పెట్టేందుకు వచ్చామంటూ ఓ గోల్డ్ చైన్‌ను తీసి చూపించారు. దుండగులు లోపలకు ప్రవేశించగానే రెండు రివాల్వర్‌లు తీసి నగదు, బంగారం ఎక్కడున్నాయో చూపించాలని బెదిరించారు.మారణాయుధాలు చూసి కార్యాలయంలోని సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన అసిస్టెంట్ మేనేజర్ హరీష్ సైరన్ ఆన్ చేయడంతో అతని తలపై రివాల్వర్‌తో దాడి చేశారు. తలకు రివాల్వర్ గురిపెట్టి సైరన్ ఆఫ్ చేయించారు. తర్వాత ఎవరైనా కదిలితే కాల్చి వేస్తామంటూ తమతో పాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్స్‌ను కార్యాలయంలోకి చెల్లాచెదురుగా విసిరారు. దీంతో సీట్లలో ఉన్న సిబ్బంది ప్రాణభయంతో భిక్కచచ్చిపోయారు. పోలీసులు సిబ్బందితో కలిసి దోపిడీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును కార్యాలయ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. దుండగులు విసిరిన బాటిళ్లలోని ద్రావకం యాసిడ్ కాదని తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోపిడీ ఘటనపై ఆలస్యంగా సమాచారం ఇచ్చారన్నారు. దుండగులు బళ్లారి వైపు వెళ్లినట్లు తెలిసిందన్నారు. అన్ని రూట్లలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.