YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆరోగ్యకర సమాజానికి ఆదరువు

ఆరోగ్యకర సమాజానికి ఆదరువు

ప్రజారోగ్యమే లక్ష్యమని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తరచూ చెప్తున్నాయి. దీనికోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తూ నిధులు కూడా కేటాయిస్తున్నాయి. అయితే పెరుగుతున్న జనాభాకు ప్రభుత్వం తరపున అందుతున్న వైద్య సేవలు సరిపోవడంలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం యత్నిస్తోంది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంతో అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుందని చెప్తోంది. ఇదిలాఉంటే ఆయుష్మాన్ భారత్ త్వరలోనే తెలంగాణలోనూ ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రంలో లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. మంచిర్యాల జిల్లా విషయానికొస్తే 8.20లక్షల మందికిపైగా జనాభాకు మంచి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమాన్ని ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి అనుసంధానించనున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యానికి, శస్త్ర చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న నిర్దిష్ట రుసుములు, ఆయుష్మాన్‌భవ కార్యక్రమంలో కేంద్రం చెల్లించే రుసుములపై తెలంగాణ సర్కారు చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం చెల్లించే రుసుముల మేరకు కేంద్రం చెల్లించేలా, ప్రైవేటు ఆసుపత్రుల వారు దీన్ని అమలు చేయటానికి ముందుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలో కార్యాచరణ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ఆ వెంటనే ఇక్కడ అమలు ప్రారంభం కానుంది.

వైద్య బీమా కార్యక్రమం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం ప్రారంభమైతే జిల్లాలోని ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో వసతులు మెరుగుపడతాయని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మూడు పీహెచ్సీలు ఉత్తమ వైద్య సేవలు అందిస్తుండటంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ పథకం ప్రారంభమయ్యాక మరింతగా ఆధునిక పరికరాలు, ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు. ఏదేమైనా జిల్లాలో మొత్తం 72 పీహెచ్‌సీలు, 481 ఆరోగ్య ఉప కేంద్రాలు వెల్‌నెస్‌ కేంద్రాలుగా మారనున్నాయి. దీంతో పేదలు, బడుగుజీవులకు సమర్థవంతమైన వైద్య సేవలు లభించనున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కాక.. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందినీ పెంచేందుకు కృషి చేయాలని అంతా కోరుతున్నారు. కేవలం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారీ ఆసుపత్రుల్లో సిబ్బందిని పెంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts