విజయనగరం,సెప్టెంబర్ 3,
రాజకీయాల్లో కులాలకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో కులాలను బట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే, ఇలాంటి కుల రాజకీయాల నేపథ్యంలో టీడీపీ భారీగా నష్టపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అది కూడా ఉత్తరాంధ్రలోని కీలకమైన విజయనగరం జిల్లాలోనే కావడం గమనార్హం. విషయంలోకి వెళ్త. విజయనగరం జిల్లాలో ఆది నుంచి కూడా చక్రం తిప్పుతున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయనతో ఇప్పటికీ జిల్లాలోని చాలా మంది టీడీపీ నాయకులు రాజకీయంగా కులం పరంగా కూడా లాలూచీ పడతారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
పైగా, కులాలను ప్రభావితం చేయడంలో బొత్స సత్యనారాయణకు సాటి మరొకరు లేరని కూడా అంటారు. 1999లో ఎంపీగా పోటీ చేసిన బొత్స టీడీపీ నాయకురాలు పడాల అరుణపై గెలవడానికి కుల రాజకీయమే కారణమనే ప్రచారం ఉంది. దివంగత నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు శిష్యుడిగా ఎదిగిన బొత్స సత్యనారాయణ సాంబశివరాజును కనుమరుగు చేయడం వెనక కూడా ఆయన కులవాదమే పనిచేసిందన్న టాక్ విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఉంది. ఇక బొత్స సత్యనారాయణ కుల ప్రభావం ఎంతదాకా ఉందంటే. గత 2014-2019 మధ్య టీడీపీ హయాంలోనూ బొత్స తన దైన శైలిలో జిల్లాలో చక్రం తిప్పారని చెబుతారుఇక, నియోజకవర్గాల వారీగా చూస్తే.. విజయనగరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బొత్స సత్యనారాయణతో లాలూచీ రాజకీయం చేస్తారనే టాక్. సొంత పార్టీలోనే వినిపిస్తుండడం గమనార్హం. కుల పరంగా గీత బొత్స సత్యనారాయణతో మంచి రిలేషన్ కొనసాగిస్తారని కూడా అంటారు. ఇక, 2014లో బొత్స కు వైరిపక్షంగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామిని ఓడించడానికి మీసాల గీతకు బొత్స సత్యనారాయణ సహకరించారని, ఈ క్రమంలోనే ఆమె విజయనగరం నుంచి జయకేతనం ఎగురవేశారనే ప్రచారం కూడా ఉంది. నెల్లిమర్లలోనూ టీడీపీ నాయకుడు పతివాడ నారాయణ స్వామి, ఆయన కుమారుడు తమ్మినాయుడు, బొత్స మేనల్లుడు,, ప్రస్తుత ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడుకు మధ్య మంచి రిలేషన్ ఉందని.. వీరు పార్టీలతో సంబంధం లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటారని టీడీపీ వర్గాలే చర్చించుకుంటాయి.చీపురుపల్లిలో కిమిడి మృణాళి & ఫ్యామిలీ కూడా బొత్స సత్యనారాయణకు సానుకూలమనే టాక్ ఉంది. తమ అవసరాల కోసం కిమిడి ఫ్యామిలీ బొత్స విషయంలో ఎప్పుడూ సైలెంట్‌గానే ఉందని చీపురుపల్లి టీడీపీ కేడర్ గగ్గోలు పెట్టేది. ఇక్కడే కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలా మంది మండల స్థాయి నాయకులు సైతం చాలా మంది టీడీపీ నాయకులు బొత్స సత్యనారాయణకు అనుకూలంగా మారడంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందని అంటున్నారు. అయితే, టీడీపీలో కేఏ అప్పలనాయుడు వంటి వారు మాత్రమే బలంగా ఉన్నారు. బొత్స సత్యనారాయణతో అప్పలనాయుడు లాంటి వాళ్లు మాత్రమే ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఉన్నారని… మిగిలిన వారిలో చాలా మంది బొత్సతో లాలూచీ రాజకీయం చేస్తున్నారని… అందుకే జిల్లాలో టీడీపీ రోజు రోజుకు పతనమవుతోందని సొంత పార్టీ కేడరే వాపోతున్న పరిస్థితి. ఇక, అశోక్ గజపతిరాజు వంటివారు ఉన్నా ఆయన వయస్సు పైబడడంతో జిల్లా పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో విజయనగరం జిల్లాలో గత ఎన్నికల తర్వాత పార్టీ మరింత డీలా పడింది. ఫైనల్‌గా టీడీపీలో పై నాయకులు లాలూచీ రాజకీయం చేస్తూ వారి పనులు చేయించుకుంటున్నా ద్వితీయ శ్రేణి కేడర్ మాత్రం తీవ్రంగా నలిగిపోతోంది.