విశాఖపట్టణం, సెప్టెంబర్ 3,
శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం టెక్కలి. ఇక్కడి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు వరుస విజయాలు సాధించారు. 2014లో ఆయన విజయం సాధించి.. మంత్రి పదవిని కూడా సొంతం చేసుకున్నారు. ఇక, గత ఏడాది జగన్ సునామీలోనూ అచ్చెన్నాయుడు సునాయాసంగా గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, ఇక్కడ అచ్చెన్నకు చెక్ పెట్టే విషయంలో వైసీపీ అధినేత జగన్ పిల్లి మొగ్గలు వేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. పైగా జగన్ ఫార్ములాతో పార్టీ పరిస్థితి కూడా దారుణంగా తయారైందని అంటున్నారు. 2004 నుంచి ఇక్కడ దువ్వాడ శ్రీను ఫ్యామిలీ పోటీ చేస్తూ వస్తోంది. 2004లో ఇక్కడ దువ్వాడ వాణి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీను ఓడిపోగా.. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో మరోసారి ఓడారు.ఇక 2014లో ఇక్కడ వైఎస్సార్ సీపీ టికెట్‌ను దువ్వాడ శ్రీనుకు ఇచ్చారు. అయితే, ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఎన్నికల్లో భారీ మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. పేరాడ తిలక్‌ను తీసుకువచ్చి.. ఇక్కడ నిలబెట్టి.. దువ్వాడకు శ్రీకాకుళం ఎంపీ సీటును కేటాయించారు. ఆ టైంలో దువ్వాడ తాను ఎప్పటి నుంచో కష్టపడుతున్నానని.. ఈ సారి టెక్కలిలో గెలుస్తానని పట్టుబట్టినా జగన్ మాత్రం దువ్వాడను లోక్‌సభకు పోటీ చేయించారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి టెక్కలి అసెంబ్లీ లేదా శ్రీకాకుళం ఎంపీ సీటు ఇవ్వాలని కోరినా జగన్ మాత్రం ఆమెకు విజయనగరం పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షురాలి పదవి ఇచ్చారు.అయితే, అటు టెక్కలిలో పేరాడ, శ్రీకాకుళంలో దువ్వాడ ఇద్దరూ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో.. ముఖ్యంగా టెక్కలిలో పేరాడ తిలక్.. సరిగా పనిచేయడం లేదని, పార్టీని పరుగులు పెట్టించలేక పోతున్నారని భావించిన జగన్.. తిరిగి ఇక్కడి బాధ్యతలను తాజాగా దువ్వాడ శ్రీనుకు ఇచ్చారు. ఇంత బలమైన గాలి ఉన్నప్పుడు కూడా టెక్కలిలో వచ్చిన మెజార్టీతోనే అచ్చెన్న గెలవడంతో పాటు శ్రీకాకుళం ఎంపీ సీటు సైతం పార్టీ కోల్పోయింది. ఇక ఎన్నికలకు ముందు వరకు టెక్కలిలో పేరాడ తిలక్ వైపే మొగ్గు చూపిన జగన్ ఇప్పుడు దువ్వాడ శ్రీనుపై మంచి సానుకూల ధృక్పథంతో ఉన్నారు. ఈ మార్పుతో ఇప్పుడు పేరాడ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.అయితే, ఇలా జగన్ పిల్లిమొగ్గల రాజకీయం కారణంగా ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. కిల్లి ఒకవైపు, పేరాడ, దువ్వాడలు ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు చేస్తుండడంతో వైసీపీ బలోపేతంపై ఎవరూ దృష్టి పెట్టలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. పైగా టీడీపీ ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో జగన్ సైతం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో టెక్కలి వైసీపీలో అంతా గందరగోళంగా ఉంది.