న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3,
రాష్ట్రాలు దివాలా దిశలో పయనిస్తున్నాయి. అందరికీ నిధులు కావాలి. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ సొమ్ములు సైతం పెండింగులో పడిపోయాయి. గట్టిగా డిమాండ్ చేసి తెచ్చుకోవాలని అన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. కలిసికట్టు కార్యాచరణ మాత్రం కరవు అవుతోంది. ఇందుకు రాజకీయ కారణాలే దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికీ కేంద్రం బలమైన నాయకత్వంలో ఉంది. రాష్ట్రాల్లోనూ సగానికి పైగా బీజేపీ, మిత్రపక్షాల నేతృత్వంలోనే ఉన్నాయి. నాలుగు పెద్ద రాష్ట్రాలు , ఒక పది చిన్నచితక రాష్ట్రాల్లో కాంగ్రెసు, ప్రాంతీయపార్టీలు, వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే బలమైన సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి వీలవుతుంది. కానీ వేర్వేరు కారణాలతో ఒకే వేదికమీదకు రావడానికి సాహసించలేకపోతున్నాయి.2019 ఎన్నికల తర్వాత ఇటీవలనే కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా చొరవ చూపారు. ఎన్డీయేతర ముఖ్యమంత్రులు ఒక ప్లాట్ ఫారంపైకి వచ్చి రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి నాలుగు కాంగ్రెసు పాలిత రాష్ట్రాల సీఎంలు, రెండు మిత్ర పక్ష రాష్ట్రాల సీఎంలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాత్రం హాజరయ్యారు. కాంగ్రెసు ఆశించిన ఫలితం రాలేదు. సంస్కరణల పేరుతో సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్రాలను కేంద్రం దెబ్బతీస్తోందనేది ఆరోపణ. తక్షణం జీఎస్టీ చట్టం ప్రకారం నిధులు ఇవ్వాలనేది డిమాండ్. ఈ రెండింటి కోసం సమైక్య పోరాటం సాగించాలనేది అజెండా. అయితే అజెండా పెద్దగా ముందుకు కదలలేదు. కేవలం జేఈఈ , నీట్ పరీక్షలపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంతోనే సరిపోయింది. వామపక్షాలను, ఇతర ప్రాంతీయ పార్టీలను దేశంలో పెద్ద పార్టీలుగా చెప్పుకునే సమాజ్ వాదీ, బహుజనసమాజ్ వంటి పార్టీలను కూడా ఈ సమావేశం కదిలించలేకపోయింది. ప్రభుత్వ పక్షాలు కాకపోయినా రాజకీయ పార్టీలుగా కాంగ్రెసు అజెండాపై అవి పెద్దగా స్పందించలేదు. బీజేపీని ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు కాంగ్రెసు సంతరించుకో లేకపోయిందనే అనుమానాలున్నాయి. ఈ కారణంతోనే మిగిలిన పార్టీలు కాంగ్రెసుకు చేరువ కావడానికి సాహసించడం లేదు. కాంగ్రెసుతో చేతులు కలిపితే కేంద్రం తమను దూరం పెట్టి అనవసర ప్రతీకార చర్యలకు దిగవచ్చనే ఆందోళన ఇందుకు మరో కారణం.కాంగ్రెసును తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావించే కొన్ని పార్టీలున్నాయి. అవి హస్తం పార్టీ వేదికను వినియోగించుకోవడానికి ఇష్టపడటం లేదు. కమ్యూనిస్టులు తమ రాజకీయ అవసరాలకోసం, బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు గతంలో కాంగ్రెసుతో జాతీయ స్థాయిలో చేతులు కలిపారు. పశ్చిమబెంగాల్ లో కలిసి పోటీ చేశారు. పెద్దగా ప్రయోజనం సమకూరలేదు. పైపెచ్చు ఈ నిర్ణయం పార్టీలోనే అంతర్గత విభేదాలకు కారణమైంది. అందుకే కేరళ ప్రభుత్వం కాంగ్రెసుతో ఎక్కడా గళం కలపడం లేదు. ఢిల్లీ లో అరవింద్ కేజ్రీవాల్ సైతం కాంగ్రెసుకు చేరువై అనవసర ఇబ్బందులు తెచ్చుకోవడానికి సిద్దం గా లేరు. అందుకే బీజేపీ కంటే కాంగ్రెసుతోనే దూరం పాటిస్తున్నారు. ఇటువంటి రాష్ట్రాలు కాంగ్రెసు నాయకత్వంలో లేని ఒక తటస్థ వేదికను తయారు చేయాలని భావిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగమే తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం. ఈ సమావేశంలో తెలంగాణ, కేరళ, ఢిల్లీలతో పాటు పశ్చిమబెంగాల్ , ఛత్తీస్ గఢ్, పంజాబ్ మంత్రులూ పాల్గొన్నారు. తటస్థ వేదికను సైతం వినియోగించుకోవాలనే కాంగ్రెసు ప్రయత్నంలో భాగంగానే ఛత్తీస్ గఢ్, పంజాబ్ మంత్రుల హాజరును పరిగణనలోకి తీసుకోవాలి. ఏ వేదికైనా కేంద్రంతో పోరాటానికి సిద్దమని చెబుతోంది పశ్చిమ బెంగాల్ వైఖరి.కేంద్రంతో తీవ్రంగా విభేదించడానికి ఇష్టపడని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిసా, తమిళనాడు చేరుతున్నాయి. ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఒక్క ఒడిసాను మినహాయిస్తే మిగిలిన చోట్ల బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు. అయినప్పటికీ ఒడిసా సైతం కేంద్రానికి వివిధ సందర్బాల్లో సానుకూలంగానే వ్యవహరిస్తోంది. సోనియా నాయకత్వంలోని ముఖ్యమంత్రుల సమావేశంలోనూ, తెలంగాణ ఆధ్వర్యంలో సాగిన ఆర్థిక మంత్రుల సమావేశంలోనూ ఈ రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించలేదు. కేంద్రంతో మంచిగా ఉంటూనే నిధులు సాధించాలనేది ఈ రాష్ట్రాల ఎత్తుగడ. తమిళనాడులో రాష్ట్ర రాజకీయ నాయకత్వం బలహీనపడింది. కేంద్రం సహకారం అవసరం. ఆంధ్ర్రప్రదేశ్ ను ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. పరిపాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు కేంద్రం ఆమోదముద్ర అవసరం. ఒడిసా ఇప్పటికే రాజకీయ స్థిరత్వాన్ని సాధించింది. ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకోవాలనే భావనలో ఉంది. బీజేపీ రాష్ట్రంలో బీజేడీకి ప్రత్యర్థి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. అనవసరంగా రచ్చ చేసుకోవడానికి ఒడిసా ఇష్టపడటం లేదు. అడిగినా , అడగక పోయినా అన్ని రాష్ట్రాలతో పాటే తమకూ వాటా వస్తుందనే అంచనాతో ఉన్నాయి ఈ రాష్ట్రాలు.జీఎస్టీ పరిహారంపై అన్ని రాష్ట్రాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. దాదాపు లక్షన్నరకోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లే ప్రతిపాదనలను కేంద్రం చేస్తోంది. దీనిపై పోరులో కలిసికట్టుగా ఉండలేని నిస్సహాయత రాష్ట్రాలను వెన్నాడుతోంది. అయితే ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం కొన్ని కీలకమైన , హేతుబద్ధమైన ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు తగ్గినప్పుడు కేంద్రం 16శాతం సెస్సు విధించింది. లక్ష కోట్ల రూపాయలు అదనపు ఆదాయం ఆర్జించింది. రుణాల సేకరణకు ఎఫ్ ఆర్ బీఎం పరిమితి రాష్ట్రాలకు మూడు శాతం, కేంద్రానికి అయిదుశాతమెందుకు? అని నిలదీసింది. అదే సమయంలో 2017 లో జీఎస్టీ పన్నుల వృద్ధిరేటు అంచనాను 14 శాతంగా లెక్క కట్టారు. ఇప్పుడు దానిని 10 శాతానికి తగ్గించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిని ఎలా సమర్థించుకుంటారంటూ కేంద్రానికి రాష్ట్రాల ఆర్థికమంత్రులు అల్టిమేటం ఇచ్చారు. మొత్తమ్మీద నిధుల సమీకరణకు కేంద్రానికి ఉన్న వెసులుబాట్లు ఎక్కువ. రాష్ట్రాలకు అంతంతమాత్రమే అవకాశాలు. రాజకీయంగా విభేదాలు ముదరకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రస్తుతమున్న అనూహ్య పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణను పక్కనపెట్టి ఆదుకోవాల్సిన అవసరమూ ఉంది