YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గ్రాంట్లకు కోతలు!

గ్రాంట్లకు కోతలు!

2014లో కాంగ్రెస్ వ్యతిరేకత..బీజేపీకి ఓట్లు కురిపించింది. అఖండ విజయం కట్టబెట్టింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అప్పట్లో హస్తంపార్టీ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి బీజేపీ కూడా అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల మద్దతు ఆ పార్టీకి అత్యవసరం. దీంతో ప్రాంతీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకునే కార్యక్రమానికి తెరతీసింది కాషాయదళం. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆర్ధిక గణాంకాలతో కేంద్రం మైండ్ గేమ్ కు తెరతీసిందని విశ్లేషకులు అంటున్నారు. నిధులు ఇస్తున్నా తీసుకోవడంలేదంటూ కొత్త రాగం వినిపిస్తున్న కేంద్రం ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చే ఆర్ధిక ప్రయోజనాల్లోనూ కోత విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

15వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. నిధుల వినియోగంలో రాష్ట్రాల అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం. రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకునేందుకే వాటి వాటాను కుదిం చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ నిర్వహణకు జీఎస్టీ మండలి ఉండగా.. జీఎస్టీ విధానం అన్నిరాష్ట్రాల్లో ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేసే బాధ్యతను 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం అప్పగించడంలో ఉన్న అంతరార్థం పన్నుల్లో వాటా తగ్గించడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

నవ్యాంధ్రకు రకరకాలుగా అన్యాయం చేస్తున్న కేంద్రం మరో ఆర్థిక గిమ్మిక్కుకు తెరలేపిందని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల అవసరం ఆంధ్రప్రదేశ్ కు లేదని నిరూపించేందుకు పావులు కదుపుతున్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనా గణాంకాలను అమాంతం పెంచేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. 2018-19ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో రాష్ట్ర జీఎస్ డీపీని 8లక్షల 70వేల కోట్లుగా ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవే అంచనాలను ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. అయితే ఏపీ జీఎస్డీపీ 9 లక్షల 19వేల కోట్లు అంటూ కేంద్ర గణాంకాల సంస్థ పేర్కొంది. అంచనా ఏకంగా 49వేల కోట్లు పెంచేయడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్పించడానికే అని అంటున్నారు. 

Related Posts