అమరావతి సెప్టెంబర్ 3
అధికార వైసీపీ భీకరంగా విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే బలమైన టీడీపీ పునాదులు కూడా కదిలిపోతున్నాయి. వైసీపీని ఎదుర్కోవడంలో టీడీపీ విఫలమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇప్పటికీ టీడీపీని వెంటాడుతోంది. వైసీపీ ధాటికి ఇప్పటికే ముగ్గురు టీడీపీ నేతలు జైలుపాలయ్యారు. వైసీపీ భయానికి టీడీపీ నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి వీర విధేయుడైన అచ్చెన్నాయుడిని జైలుకు పంపి సర్కార్ ప్రతీకారం తీర్చుకోవడం.. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నాడని తెలుస్తోంది.గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అచ్చెన్నాయుడు కుటుంబమే టీడీపీలో బాగా ఇబ్బంది పడింది. ఎక్కువ కాలం జైల్లో అచ్చెన్న ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు ఏపీ టీడీపీని సిద్ధం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా టీడీపీనే నమ్ముకొని ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బాబు యోచిస్తున్నారట..ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావ్ ను దించేసి ఆయన స్థానంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నియమించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండల స్థాయిలో ఇప్పటికే టీడీపీ పూర్తి చేయగా.. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించనుంది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి పెడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.