హైదరాబాద్ ఏప్రిల్ 16
మక్కా మసీదు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తీర్పు వెలువరించిన వెంటనే హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామా ఆమోదించేవరకు తనకు సెలవు ఇవ్వాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెబుతున్నప్పటికీ... గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు తెలియవచ్చింది. మక్కా మసీదు పేలుళ్ల కేసుకు సంబంధించి ఏమైనా ఒత్తిడిలు ఎదుర్కొంటున్నారాఇంకేమైనా ఒత్తిడులు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. తీర్పు ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేయడం తీవ్ర సంచలనం కలిగిస్తుంది. తన రాజీనామాకు సంబంధించి ఇప్పుడేమీ మాట్లాడలేననిరాజీనామా ఆమోదం పొందిన తర్వాత తాను చెప్పదలచుకున్న విషయాలను మీడియా సమావేశంలో మాట్లాడతానని రవీందర్ రెడ్డి చెప్పారు. ఇవాళ్టి తీర్పు తర్వాత బెదిరింపులు వచ్చినట్లు రవీందర్ రెడ్డి ఆయన మిత్రులతో చెప్పారని సమాచారం. వాస్తవానికి మరో రెండు నెలల్లో రవీందర్ రెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది.మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులపై ఉన్న నేరారోపణలు నిరూపణ కాని కారణంగా నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించి, ఆ కేసుని కొట్టేసిన విషయం తెలిసిందే.