విజయవాడ, సెప్టెంబర్ 4,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై జనసేన పార్టీ కన్నా బిజెపి మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది, పెంచుకుంది. ఆయనతో కలిసి నడిస్తే ఆ చరిష్మా కి మోడీ ఇమేజ్ తోడైతే తమ పార్టీ ముందుకు వెళ్ళిపోతుంది ఎపి లో అని లెక్కలు వేసుకుంది. ఇదంతా సోము వీర్రాజు ఎపి బిజెపి చీఫ్ గా అయ్యాక అనుకున్న వ్యూహం. కమలం అడుగులకు అనుగుణంగానే ఇకపై పవన్ కళ్యాణ్ పరిగెడతారని జనసేన వర్గాలు పరితపించాయి. రెండు పార్టీలు కలిసి ముందు టిడిపి ని తొక్కి వైసిపి కి తొడకొట్టాలన్న అజెండా తో ఉన్నాయి. అయితే ఇవన్నీ కలలే అన్న తరహాలో జనసేనాని అడుగులు స్పష్టం చేస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.పార్టీ నిర్మాణం పక్కన పెట్టి ప్రస్తుతం తనకు వచ్చే సినిమా ఆఫర్లను వచ్చినవి నచ్చినవి సంతకాలు చేసే పనిలో పవన్ కళ్యాణ్ చాలా బిజీ అయిపోయారు. కరోనా తగ్గడం లేదా వ్యాక్సిన్ వస్తే ఆయన సినిమాలు వరుస పెట్టి విడుదల అయ్యేలా ఉన్నాయి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఆరు సినిమాల వరకు కమిట్ అయిపోయారు. మొన్నటి వరకు మూడు నాలుగు సినిమాల తరువాత పొలిటికల్ గా స్పీడ్ పెంచుతారని పార్టీని నడపటానికి నాలుగు డబ్బులు కూడా అవసరమే కదా అని అంతా లెక్కేశారు. అయితే ఇప్పుడు సీన్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ మార్చేశారు.తన పొలిటికల్ గ్రాఫ్ సంగతి పక్కన పెట్టి ముందు సినిమా గ్రాఫ్ బాగా పెరిగే పనిలో పడిపోవడం చర్చనీయంగా మారింది. మూడు నాలుగు సినిమాలు కాస్తా ఆరు సినిమాలకు పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. ఈ సంఖ్య మరింత పెరోగొచ్చని అంటున్నారు. మొత్తం అన్ని సినిమాలు షూటింగ్ లు పూర్తి కావాలంటే దాదాపు రెండేళ్ళు సమయం పడుతుందని అలాంటప్పుడు జనసేన రాజకీయాలు జోరందుకోవాలంటే మరో రెండేళ్లు ఆగాలిసిందే అని తెలిసిపోతుందంటున్నారు. అదే జరిగితే ఎప్పటిలాగే తమ అధినేతను పార్ట్ టైం పొలిటీషియన్ గానే ప్రజలు భావించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు ఇదే విషయాన్ని పెద్దవి చేస్తాయన్న ఆందోళన జనసైనికుల్లో కనిపిస్తుంది.పవన్ కళ్యాణ్ ఆరు సినిమాలతోనే ఆగుతారా లేక ఈ సంఖ్య మరింత పెంచుతారా అన్నది కూడా క్లారిటీ లేదని తెలుస్తుంది. 2024 ఎన్నికల ముందు వరకు సినిమాల్లో బిజీగా రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికలపై చురుగ్గా ఉంటె సరిపోతుందని జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నా బిజెపి మాత్రం ఆయన వ్యవహారం నిశీతంగా పరిశీలిస్తుంది. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని ఎన్నో వ్యూహాలు అమలు చేయాలని ఉద్యమాలు చేయాలని తహ తహ లాడుతుంది కమలం. అయితే వారి ఆశలపై పవన్ నీళ్ళు చల్లేలాగే వ్యవహారం సాగుతుందంటున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ కలిసి రాకపోతే ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకోవడం బెటర్ అన్నది కాషాయధారుల ఆలోచన గా ఉందంటున్నారు. మొత్తానికి పవన్ వెండితెర వైపే ఎక్కువ మక్కువ పెంచుకోవడానికి మాత్రం అనేక రీజన్స్ ఉన్నా ఎపి లో ఎదిగేందుకు సమయం ఆసన్నం అయిన తరుణంలో ఆయన పాలిటిక్స్ లో పెద్దగా యాక్టివ్ కాకపోవడం ఆయనను నమ్ముకున్నవారిని మాత్రం నిరాశకు గురిచేస్తుంది.