శ్రీకాకుళం, సెప్టెంబర్ 4,
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 14 విశిష్టమైన వస్తువులను ఎంపిక చేసింది. అందులో శ్రీకాకుళం జిల్లా తరఫున పలాస జీడిపప్పుకు అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్‌లో భౌగోళిక గుర్తింపు ఇచ్చి అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రాముఖ్యతను తీసుకొచ్చేందుకు ఈ ఎంపిక చేపట్టింది. స్థానికంగా ప్రాచుర్యం పొందిన విశిష్ట వస్తువులను మన ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించి ఆదాయాన్ని తెచ్చిపెట్టడానికి, అధికంగా ఎగుమతులు పెరగడానికి తోడ్పాటునందిస్తోంది. ఉద్దానం ప్రాంతంలోని వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. సుమారు 5 లక్షల క్వింటాలు జీడిపిక్కలు దిగుబడి అవుతున్నాయి. జీడిపిక్కల బస్తా(80 కిలోలు) సుమారు రూ.13 వేలు ధర పలుకుతోంది. కరోనా కారణంగా వ్యాపారాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర రూ.10 వేలు ప్రకటించింది. ఈ పంటే ఇక్కడ ప్రజలకు జీవనాధారంగా ఉంది.ప్రస్తుతం మార్కెట్‌లో కిలో జీడిపప్పు నంబర్ 1 రకం కిలో రూ.800 ధర పలుకుతోంది. జిల్లాలో జీడి పంటకు కేరాఫ్‌గా నిలిచిన ఉద్దాన ఏడు మండలాల్లో అధికంగా జీడి పంటలు పండుతున్నాయి. పలాస కేంద్రంగా 300కుపైగా పరిశ్రమలు, జిల్లా వ్యాప్తంగా ఏఓబీతో కలుపుకుని 400 పైగా పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 500–600 టన్నుల జీడిపిక్కల ప్రొసెసింగ్ కు 150 టన్నుల జీడిపప్పు సిద్ధం చేస్తుంటారు. ఇలా పరిశ్రమల్లో పిక్కలు బాయిలింగ్ చేసి పప్పుగా మార్చి ఎగుమతులలో రోజుకు రూ.5 నుంచి రూ.6 కోట్లు వ్యాపారం జరుగుతుంటుంది. రూ.5–6 కోట్లకుగాను జీఎస్టీ రూపేనా రోజుకు రూ.25–30లక్షలు ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. ప్రత్యక్షంగా 15వేల మంది, పరోక్షంగా 5వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు జిల్లాలో ఉన్న 400కు పైగా పరిశ్రమలు సక్రమంగా నడవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ ద్వారా అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేశారు.